యువ గళం యాత్రలో ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదని, వైసీపీ దాడులపై తాము ముందే సమాచారం ఇస్తున్నా పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, పోలీసులు వారికే భద్రత కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న భీమవరంలో జరిగిన బహిరంగ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ బేతపూడి క్యాంపులో బస చేసిన లోకేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీటిని లోకేష్ తిరస్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ వారు తమ జోలికి రాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంటుందని, అనుమతి ఇచ్చిన దారిలోనే యాత్ర చేస్తున్నానని స్పష్టం చేశారు. చట్టాలు ఉల్లంఘించడం తన జీవితంలో ఉండదని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలను కించపరిచేలా తానూ ఎప్పుడూ మాట్లాడలేదని, ఏ జిల్లాలో జరగని అల్లర్లు ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయని, మా కార్యకర్తల చేతిలో ఒక్క రాయి అయినా చూశారా అని ప్రశ్నించారు.