Sunday, January 19, 2025
HomeTrending Newsరిటర్న్ గిఫ్ట్ ఇస్తాం : బాబు హెచ్చరిక

రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం : బాబు హెచ్చరిక

రాష్ట్రంలో బీసీ నేతలను జగన్ ప్రభుత్వం వేధిస్తోందని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కూన రవి కుమార్ లాంటి నేతలను  అరెస్టు చేశారని, 72 ఏళ్ళ వయసులో అయ్యన్నపాత్రుడిపై  నిర్భయ కేసు పెట్టారని బాబు అన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తే సిఎం జగన్ కు నచ్చడం లేదన్నారు. బిసిలు 26మందిని పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క పల్నాడులోనే 16 మందిని చంపారని, రాష్ట్ర వ్యాప్తంగా 2,650 మంది బిసిలపై తప్పుడు కేసులు పెట్టారని వివరించారు.  అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం పెట్రేగిపొతే.. మాకూ రోజులు వస్తాయని.. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే రోజు తొందర్లోనే ఉందని బాబు హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తోన్న చంద్రబాబు కావలిలో ‘ఇదేం ఖర్మ మన బిసిలకు’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాబు మాటాడుతూ…  బిసిలకు పదవులు ఇచ్చామని చెబుతున్నారని… టిటిడి ఛైర్మన్, ముఖ్యమైన కార్పొరేషన్, సలహాదారులు, వైస్ ఛాన్సలర్ పదవులు ఇవ్వకుండా నామమాత్రంగా 56 కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చారని విమర్శించారు. సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ లో, నవ్యాంధ్ర లో కూడా ముఖ్యమైన పదవులు బిసిలకు ఇచ్చామని బాబు తెలిపారు. ఇస్త్రీ పెట్టెలు,  సెలూన్లు  ఇచ్చారంటూ సిఎం జగన్ వృత్తులను ఎగతాళి చేస్తున్నారని దుయ్యబట్టారు. కులవృత్తులు కనుమరుగైన పరిస్థితుల్లో వాటిని ఆధునీకరించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. టిడిపి హయంలో 120 బిసి కులాలకు వెయ్యి కోట్లు కేటాయించి ఆదుకున్నామని అన్నారు. ఈ ప్రభుత్వ హయంలో బిసిల్లో కేవలం 10 శాతం మందికే రుణాలు ఇచ్చారని,  కానీ తాము బిసిలకు సబ్ ప్లాన్ తీసుకు వచ్చి 36వేల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం 217 జీవోపై రిజర్వేషన్స్ పెట్టిన చరిత్ర తమదేనన్నారు.

చేనేత రంగానికి కూడా తమ హయంలో ఎంతో న్యాయం చేశామని, సగం ధరకే చీర, ధోవతి అందించి చేయూత ఇచ్చామన్నారు. బిసిలు 40 ఏళ్ళుగా పార్టీకి అండగా ఉందని.. వారికి రుణపడి ఉన్నామని, తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా బిసిలకు సాయం చేసి కృతజ్ఞత తీర్చుకుంటామని భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్