అధికారానికి ఒక ఆకారం అనేది ఉండదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. బీసీలకు కేవలం పదవులు మాత్రమే ఇస్తున్నారని అధికారాలు, నిధులు ఇవ్వడం లేదంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను బొత్స ఖండించారు. ఈనెల 7న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘జయహో బిసి మహాసభ – వెనుకబడిన కులాలే వెన్నెముక’ పేరిట వైఎస్సార్సీపీ ఓ సదస్సును నిర్వహిస్తోంది. స్టేడియంలో జరుగుతోన్న ఏర్పాట్లను ఆ పార్టీ నేతలు పరిశీలించి అనంతరం ఈ కార్యక్రమ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ తాము మంత్రులుగా ఉన్నామని, గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించిన తరువాత బిజినెస్ రూల్స్ అనుసరించి తాము విధులు నిర్వహిస్తామని, కొన్ని బాధ్యతలు ఉంటాయని, దాని ప్రకారం విధులు నిర్వహిస్తామని, కానీ మంత్రులను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. ప్రతి ఒక్కరికీ ఆత్మ గౌరవం ఉంటుదని దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు.
బీసీల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఏంచేసిందనే విషయాన్ని తెలియజేప్పెందుకే ఈనెల 7న విజయవాడలో’ జయహో బీసీ సదస్సును నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి వెల్లడించారు. దాదాపు 84వేల మందికి ఆహ్వానాలు వెళుతున్నాయని, అందరూ ఆరో తేదీ సాయంత్రానికే విజయవావ చేరుకోవాలని, వారికి వసతి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పదవులు పొందిన ప్రతి బీసీ నేత ఈ సదస్సులో పాల్గొంటారని చెప్పారు. చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరివని, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఉండదని జోస్యం చెప్పారు. చంద్రబాబు మళ్ళీ సిఎం అయ్యే అవకాశాలు ఏమాత్రం లేవని విజయసాయి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వర రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.