ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలన్నీ అట్టడుగు స్థాయి వరకు చేరాలన్నదే సిఎం జగన్ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అందుకే సమాజంలోని అణగారిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. బాబూ జగ్జీవన్‌రామ్ వంటి మహనీయుల స్పూర్తితో ముందడుగు వేస్తున్నట్లు వెల్లడించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనమండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొని జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం జరిగిన సభలో సజ్జల మాట్లాడుతూ.. దేశ విముక్తి కోసమే కాకుండా, అణగారిన వర్గాల విముక్తి కోసం కూడా బాబూ జగ్జీవన్‌రామ్ లాంటి మహనీయులు ఎందరో తమ జీవితాలను త్యాగం చేశారని కీర్తించారు. ఆయన వర్ధంతి రోజున కేవలం పూలదండ వేసి నివాళులు అర్పిస్తే సరిపోదనీ… వారి స్పూర్తితో సమసమాజ నిర్మాణం దిశగా, ఏ విధంగా ముందడుగు వేయాలనేది ప్రతి ఒక్కరూ పునశ్చరణ చేసుకోవాల్సి ఉందన్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్ గారు ఒక బాధ్యతగా అట్టడుగు వర్గాల సంక్షేమానికి అంకితమైనట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం ఒక మొక్కుబడి తంతులా కాకుండా, నేరుగా వారికి, వారి బ్యాంకు అకౌంట్లల్లో నగదు బదిలీ అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు వివరించారు. గడచిన రెండేళ్ళ పాలనలోనే అట్టడుగు వర్గాల్లో చైతన్యం తెచ్చి వారికి సంపూర్ణ న్యాయం చేస్తున్నట్లు చెప్పారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఆ వర్గాల్లో సామాజిక, ఆర్ధిక, రాజకీయ చైతన్యం మరింత పెంపొందాల్సిన సమయం ఆసన్నమైందని, ఆ మేరకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్‌బాబు, మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, కైలే అనిల్ తదితరులు పాల్గొన్నారు.