చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందించారు. మంత్రులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పేర్ని నానిలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్ ఫిలిం నగర్ నుంచి వెలగపూడి సచివాలయానికి ఎంత దూరమో, ఇక్కడి నుంచి అక్కడికీ అంటే దూరం ఉంటుందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. చిరంజీవి తనకు అభిమాన హీరో అని… కానీ నాడు భారతంలో ధృతరాష్ట్రుడు, గాంధారిలకు తన కుమారుడిపై ఉన్న వల్లమాలిన ప్రేమ వల్ల ఎంత నష్టం జరిగిందో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని అన్నారు. సినిమాను సినిమాగా చూడాలని, రాజకీయాన్ని రాజకీయంగా చూడాలాని… వేరే ఏ ఇతర హీరోలను ఏ పార్టీ వారైనా ఏమైనా అన్నారా అని ప్రశ్నించారు. కథకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఇక్కడి ఓ రాజకీయ నాయకుడి పాత్రను సినిమాలో ప్రవేశపెట్టి అతనిపై కక్ష కట్టేలా తీసినప్పుడు మాట్లాడకుండా ఎలా ఉంటామని…. బాహ్య ప్రపంచంలో మనం గిల్లినప్పుడు ఎదుటి వారు కూడా గిల్లుతారని…. మహేష్ బాబు సినిమాలో మాదిరిగా ‘ నేను గిల్లితే గిల్లిచ్చుకోవాల’నే పధ్ధతి ఇక్కడ పని చేయదని స్పష్టం చేశారు. ఏ హీరో రెమ్యునరేషన్ ఎంత అని ఎవరైనా అడిగారా… తాము జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, రామ్, రవితేజ, చిరంజీవి మేనళ్ళుల్లు, తమ్ముడి కుమారుడు హీరోలుగా ఉన్నారని…. వీరిపై తాము ఎపుడైనా మాట్లాడారా అని నాని అడిగారు. మీరు మాట్లాడారు కాబట్టే మేము కూడా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం చేసినప్పుడు చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న విషయం మర్చి పోకూడదని, ప్రత్యేక హోదాను ఎందుకు నాడు సాధించలేకపోయారని నిలదీశారు.
పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమాలుతీశారని వాటి గురించి తాము ఎప్పుడూ మాట్లాడలేదని, బ్రో సినిమాలో పాలిటిక్స్ పెట్టి మమ్మల్ని గోకాడు కాబట్టి తాము మాట్లాడామని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
తాను పిచుక అని చిరంజీవి ఒప్పుకుంటున్నారా అని మంత్రి బొత్స సత్యనారాయణ ఎదురు ప్రశ్నించారు. ఎందుకు చిరంజీవి ఆ ప్రస్తావన తెచ్చారో, ఏ ఉద్దేశంతో అలా మాట్లాడారో తనకు తెలియదని, ఆయన వ్యాఖ్యలు చూసిన తర్వాత మాట్లాడతానని చెప్పారు.