వై.ఎస్.ఆర్.సి.పి మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి శనివారం విడుదల చేశారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో 2024 మేనిఫెస్టో విడుదల చేశారు. రెండు పేజీల మేనిఫెస్టోలో పాత పథకాలు కొనసాగింపు, పెంపుదల తీరు వివరించారు. చేయగలిగినవి మాత్రమే చెబుతున్నాం అన్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి. మేనిఫోస్టో ప్రతి ప్రభుత్వ అధికారి వద్ద ఉందన్నారు. మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంధం అని అభిప్రాయపడ్డారు. 2019లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామన్నారు.
తమ మేనిఫెస్టో అమలు చేసిన తీరు చరిత్రలో నిలిఛిపోతుందన్నారు. ఇందుకోసం రూ. 2 లక్షల 70 వేల కోట్లను డిబిటి చేశామని తెలిపారు. నేరుగా ప్రజల ఖాతాల్లో డబ్బు వేశామన్నారు. రెండు పేజీల మేనఫెస్టోలో 9 హామీలు ఇచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, అభివృద్ధి, పేదలకు ఇల్లు, నాడు నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత(సోషల్ సెక్యూరిటీ) అనేవి ఇందులో ఉన్నాయి.
ఇళ్ల స్థలాలు లేని అర్హులైన వారందరికీ ఇళ్లు, వైఎస్సార్ చేయూత నాలుగు విడతల్లో రూ. 75 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంపు, రైతు భరోసా రూ. 13500 నుంచి 16000కు పెంపు, వైఎస్సార్ ఈబిసి నేస్తం నాలుగు దఫాల్లో 45 వేల నుంచి లక్షా 5 వేలకు పెంచుతామన్నారు.
మేనిఫెస్టోలో ముఖ్య అంశాలు..
– ప్రస్తుతం రూ.3వేలుగా ఉన్న పెన్షన్ రూ.3500కు పెంపు.. (2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో రూ.250 పెంచుతారు)
– వైఎస్సార్ చేయూత పథకం 4 విడతల్లో రూ.75 వేలు ఇస్తుండగా దాన్ని లక్షన్నర రూపాయలకు పెంచే ప్రతిపాదన.
– అమ్మ ఒడికి అదనంగా రూ.2వేలు. మొత్తంగా అమ్మఒడి రూ.17వేలు అవుతుంది. అందులో తల్లుల చేతికి రూ.15వేలు ఇస్తారు. మిగతా 2వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కి ఖర్చు చేస్తారు.
– వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా నాలుగు దఫాల్లో రూ.60 వేలు ఇస్తుండగా దాన్ని లక్షా 20వేల రూపాయలకు పెంచే ప్రతిపాదన.
– ఈబీసీ నేస్తం రూ.45 వేల నుంచి రూ.1.05 లక్షలకు పెంపు
– రైతు భరోసా రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు..
– వాహన మిత్రను ఐదేళ్లలో రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంపు, లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు. రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా మిగతా పథకాలన్నీ యధావిధిగా అమలులో ఉంటాయి.
ఇప్పటి వరకు అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తూ అందులో కొన్నిటికి భారీగా నిధులు పెంచుతున్నట్టు తెలిపారు సీఎం జగన్. రాజధానుల విషయాన్ని కూడా మేనిఫెస్టోలో కీలకంగా ప్రస్తావించారు సీఎం జగన్. మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖను రాజధానిని చేస్తామన్నారు. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా విశాఖను తీర్చి దిద్దుతామని, అమరావతిని శాసనరాజధానిగా చేస్తామని, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని వివరించారు.
మేనిఫెస్టో విషయంలో ఆచితూచి ముందడుగు వేశారు సీఎం జగన్. మేనిఫెస్టోలో ప్రకటిస్తే కచ్చితంగా వాటిని అమలు చేసి తీరతామన్నారు. అందుకే ఆచరణ సాధ్యమయ్యే హామీలనే ఇస్తున్నట్టు చెప్పారు జగన్. చంద్రబాబులాగా తాను మోసపు హామీలివ్వడంలేదని, 2014లో చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని, ఈసారి కూడా మోసపు హామీలతోనే బాబు సూపర్ సిక్స్ అంటూ వస్తున్నారని, వాటిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.