అమరావతి రాజధానిలో దళితులకు చెందిన అసైన్డ్ భూములను బెదిరించి, భయపెట్టి కారుచౌకగా కొట్టేయడమే కాకుండా, తమ మనుషులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, మజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు కొంతమంది ఐఏఎస్ అధికారులను అడ్డు పెట్టుకుని ఈ దారుణాలకు పాల్పడ్డారంటూ వీడియా సాక్ష్యాధారాలతో సహా బైట పెట్టారు.
చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన అమరావతి భూ కుంభకోణానికి మాస్టర్ బ్రెయిన్ మాజీ ఐఏఎస్ అధికారి సాంబశివరావు అని, ఇందుకు అప్పుడు గుంటూరు, సీఆర్డీఏలో పనిచేసిన ఐఏఎస్ లు కోన శశిధర్, కాంతీలాల్ దండే, చెరుకూరి శ్రీధర్, కొంతమంది రెవెన్యూ అధికారులు కీలక పాత్ర పోషించారని ఆర్కే ఆరోపించారు.
అమరావతిని రాజధానిగా ప్రకటించకముందే అసైన్డ్ భూముల జాబితాను రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో పెట్టారని, టీడీపీ పెద్దలు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి దళితుల అసైన్డ్ భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసి, తమ మనుషులకు కట్టబెట్టడం ద్వారా వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ భూములన్నీ టీడీపీ పెద్దలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాక ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించిందని గుర్తు చేశారు. ఇందుకు చంద్రబాబు హయాంలో పనిచేసిన కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారని, భూముల రికార్డులను కూడా మార్చేశారని ఆరోపించారు. దళితులతో అసైన్డ్ భూములకు సంబంధించిన లావాదేవీలు నెరుపుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి భూమిపుత్ర బ్రహ్మానందరెడ్డి వీడియో సంభాషణల క్లిప్‌లను మీడియా ముందు ఆర్కే ప్రదర్శించారు. ఈ సాక్ష్యాధారాలను సీఐడీ అధికారులకు ఇచ్చి, అమరావతి భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని కోరనున్నట్టు ఆర్కే తెలిపారు.