MLA attacked: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తుల దాడి చేశారు. వైసీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్‌ను కొందరు దుండగులు కత్తితో నరికి చంపారు. వైసీపీలోని మరో వర్గానికి చెందిన వారు హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ హత్యలో తలారి పాత్ర ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపై దాడికి తెగబడ్డారు. వెంటనే ఆయన్ను పోలీసులు స్థానికంగా ఉన్న ఓ పాఠశాలకు తరలించారు. ఆయన్ను అక్కడినుంచి సురక్షితంగా తరలించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అదనపు బలగాలు రప్పిస్తున్నారు. అయితే గ్రామస్తులు మాత్రం అక్కడినుంచి కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. పోలీసులు గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
జి. కోత్హపలిలో ఇళ్ళ స్థలాల పంపిణీలో కుంభకోణం జరిగిందని, 35 లక్షల రూపాయలు దోచుకున్నారని గంజి ప్రసాద్ ఆరోపణలు చేశారు. పార్టీలోని మరో వర్గం నేతలు ఈ స్కామ్ కు పాల్పడ్డారని ఎమ్మెల్యే తలారి దృష్టికి తీసుకు వచ్చారు. అయినా సరే చర్యలు తీసుకోకపోవడంతో ఈ విషయాన్ని సిఎం జగన్ వద్దకు తీసుకెళ్తానని గంజి చెప్పినట్లు తెలిసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రత్యర్థి వర్గం నేతలు గంజి ప్రసాద్ ను మట్టుబెట్టారు.