Monday, February 24, 2025
HomeTrending Newsవిభజన చట్టం ఉల్లంఘనే : ఉదయభాను

విభజన చట్టం ఉల్లంఘనే : ఉదయభాను

ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి తెలంగాణా ప్రభుత్వం పులిచింతల వద్ద విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని జగ్గయ్యపేట ఎమ్మెల్యే,  ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆరోపించారు. ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నప్పుడే, రైతుల సాగు అవసరాలకు నీరు విడుదల చేసిన సమయంలో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుందని కానీ జూన్ 29 నుంచే విద్యుత్ ఉత్పత్తి మొదలు పెట్టారని అయన వివరించారు.

పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు బయల్దేరిన ఉదయభానును ముక్త్యాల సరిహద్దుల వద్ద సూర్యాపేట పోలీసులు అడ్డగించారు. ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి వెళ్ళాలని సూచించారు. ప్రాజెక్టు పరిశీలించి వెళ్తానని ఉదయభాను పోలీసులకు వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అనుమతించలేమని పోలీసులు స్పష్టం చేశారు. దీనితో అక్కడినుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. తరువాత ముక్త్యాల-మాదిపాడు మార్గంలో కృష్ణానదిలో పడవ ద్వారా ప్రయాణించి పులిచింతల ప్రాజెక్టుకు చేరుకున్నారు ఉదయభాను. ఈ సంఘటనతో పులిచింతల వద్ద భారీగా పోలీసులను మొహరించారు.

ఉమ్మడి రాష్ట్రంలో దివంగత నేత వైఎస్సార్ ఎక్కువ సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణాలోనే నిర్మించారని, ఈ విషయం విస్మరించి కొందరు నేతలు వైఎస్ పై నీచమైన విమర్శలు చేయడం దారుణమని ఉదయభాను ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎక్కడా కేసియార్ ను గానీ, కేటిఆర్ ను గానీ విమర్శించడం లేదని, కానీ తెలంగాణా నేతలు మాత్రం సిఎం జగన్, వైఎస్ లపై రోజూ పరుష పదజాలం ఉపయోగించి విమర్శలు చేస్తున్నారని ఉదయభాను గుర్తు చేశారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణా రాష్ట్ర వైఖరిని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్