వైఎస్సార్సీపీ నేత, గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన తిరుపతి లోక్ సభ నుంచి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు. అయితే ఆయన కుమారుడు రోషన్ కు కూడా బిజెపి ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. బద్వేల్ ఎస్సీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. నేడు ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్టీ కండువా కప్పి వరప్రసాద్ ను పార్టీలోకి ఆహ్వానించారు.
కృష్ణాజిల్లాలో జన్మించిన వరప్రసాద్ ఐఏఎస్ కు ఎంపికై 1983బ్యాచ్ తమిళనాడు కేడర్ అధికారిగా, ప్రిన్సిపాల్ సెక్రటరీ తో పాటు పలు హోదాల్లో పనిచేశారు. 2009లో తన పదవికి స్వచ్చందంగా రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరి తిరుపతి లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతర పరిణామాల్లో వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో లోక్ సభకు కాకుండా గూడూరు నుంచి అసెంబ్లీ టికెట్ ను కేటాయించగా 45 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కానీ ఈ ఎన్నికల్లో జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీనిపై అసంతృప్తి చెందిన వరప్రసాద్ తొలుత పవన్ ను కలిశారు కానీ లాభం లేకపోయింది. చివరకు బిజెపి ఆయన్ను చేర్చుకొని తిరుపతి లోక్ సభ అభ్యర్ధిత్వం ఖరారు చేసింది. ఆయనతో పాటు కుమారుడికి కూడా కడప లోక్ సభ పరిధిలోని బద్వేల్ సీటు కేటాయించింది.
నేడు వరప్రసాదరావు తో పాటు ఇండియన్ మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా కూడా బిజెపిలో చేరారు.