జనవరిలో సైకిల్ స్పీడ్ పెరిగి, ఫ్యాన్ రెక్కలు విరగ్గొడుతుందని… చిల్లులు పడిన వైసీపీ నావ మునిగిపోతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలందరూ తమ జీవితాలకు భరోసా, భద్రత కోరుకుంటున్నారని అన్నారు. అరాచక సైన్యాన్ని జగన్ ప్రజల మీదకు వదిలారని, ఎమ్మెల్యేలు కూడా దౌర్జన్యాలకు తెగబడుతున్నారని విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు, మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణయ్యలతోపాటు తంబళ్లపల్లి, మంత్రాలయం, కోవూరు, ఉదయగిరి, రామచంద్రాపురం, తాడికొండ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైసేపీపై బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఎన్నడూ చూడని వింత పోకడలు రాష్ట్రంలో చూస్తున్నామని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని కేసులు పెట్టి వేధిస్తున్నారని, ప్రజలకు స్వేఛ్చ లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఎమ్మెల్యేలకు కూడా జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. ప్రజలు ఆత్మగౌరవాన్ని పెంచేది, జీవన ప్రమాణాలను పెంచేదిగా ఉండాలని, కానీ జగన్ ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని అన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన జగన్ ఎందుకు తీసుకు రాలేకపోయారని బాబు నిలదీశారు, మద్య నిషేధం, సీపీఎస్ రద్దు విషయంలో కూడా మాట తప్పారని, ఇసుకను వ్యాపారం చేశారని, అమరావతిని ధ్వంసం చేశారని మండిపడ్డారు,