Good initiative: విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం, దాని ఎజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడం శుభ పరిణామమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు. సిఎం జగన్ ఢిల్లీ వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా లతో ప్రత్యేక హోదా అంశాన్ని, విభజన హామీలను ప్రస్తావిస్తున్నారని గుర్తు చేశారు.
ఎంపీలుగా తాము కూడా ప్రతి సమావేశాలో హోదా గురించి ప్రస్తావిస్తున్నామని, సిఎం సూచలనతో ఇదే పట్టుదలతో పనిచేసి హోదా సాధిస్తామన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. హోదా ముగిసిన అధ్యాయమని మాట్లాడిన చంద్రబాబు, టీడీపీ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. దాన్ని నీరుగార్చి, ప్యాకేజీ కోసం హోదా రాకుండా చేసింది చంద్రబాబేనని గుర్తుచేశారు. ఇకనైనా వారు తమ వైఖరి మార్చుకోవాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి ముందుకు రావాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా సాధించడం కోసం చాలా గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పారు.
విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం సంతోషకర విషయమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కమిటీ ఎజెండాలో ఏపీ విభజన సమస్యల అంశం చేర్చడం హర్షణీయమన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై వైయస్ జగన్ ప్రభుత్వం, తమ పార్టీ ఎంపీలు చేసిన ఒత్తిడి ఫలించిందన్నారు. విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని కోరారు.