Sunday, January 19, 2025
HomeTrending Newsరోడ్లు అప్ గ్రేడ్ చేయండి

రోడ్లు అప్ గ్రేడ్ చేయండి

విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరం నుంచి నర్సీపట్నం, నర్సీపట్నం నుంచి తుని మధ్య ఉన్న రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చి అభివృద్ధి చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు మంగళవారం గడ్కరీతో సమావేశమయ్యారు.

విశాఖ జిల్లాలో విస్తృతమైన రోడ్డు నెట్‌ వర్క్‌ ఉన్నప్పటికీ నానాటికీ పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్నిఎంపీ విజయసాయిరెడ్డి మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. సబ్బవరం జంక్షన్‌ నుంచి వెంకన్నపాలెం, చోడవరం, వడ్డాది, రావికమతం, కొత్తకోట మీదుగా నర్శీపట్నం వరకు ఉన్నరాష్ట్ర రహదారి (ఎస్‌హెచ్‌-009), అలాగే నర్శీపట్నం నుంచి గన్నవరం, కోటనందూరు మీదుగా తుని వరకు ఉన్న రహదారి (ఎస్‌హెచ్‌ -156) అత్యంత రద్దీ కలిగిన రహదారులైనందున వాటిని జాతీయ రహదారులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. ప్రతిపాదించిన ఈ రెండు జాతీయ రహదారుల పొడవు 109 కిలోమీటర్ల వరకు ఉంటుందని చెప్పారు.

ఈ రెండు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులగా అభివృద్ధి చేయడం వలన అవి కోల్‌కత్తా-చెన్నై, రాయపూర్‌-విశాఖపట్నం, రాజమండ్రి నుంచి కొయ్యూరు, పాడేరు, చింతపల్లి, లంబసింగి, అరకు, బౌదర మీదుగా విజయనగరం వరకు ప్రతిపాదించిన (ఎన్‌హెచ్‌ 516ఈ) జాతీయ రహదారి, పెందుర్తి నుంచి కొత్తవలస, లక్కవరపు కోట, శృంగవరపు కోట మీదుగా బౌదర వరకు ప్రతిపాదించిన (ఎన్‌హెచ్‌ 516బీ) రహదారులతో నుసంధానం చేయడానికి మార్గం సుగమం అవుతుందని విజయసాయి రెడ్డి తెలిపారు.

మన్యంలోని అరకు, పాడేరు వంటి ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేయడం వలన గిరిజనులు తమ అటవీ ఉత్పాదనలను త్వరితగతిన తమ సమీప మార్కెట్లకు తరలించే అవకాశం ఏర్పడుతుందని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్