రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కోసం లక్షల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల రూపంలో నేరుగా అందిస్తోన్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. పేదవర్గాల పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువులు అందుబాటులోకి తెచ్చారని కొనియాడారు. వైఎస్సార్సీపీ నిర్వహిస్తోన్న సామాజిక సాధికార యాత్ర నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది. ప్రజలు ఈ యాత్రకు ఘనస్వాగతం పలికారు. అశేష జనవాహినితో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు పార్థసారథి, హఫీజ్ ఖాన్; ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ యాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేరుగ మాట్లాడుతూ…సిఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్నింటా అగ్రస్థానం ఇస్తున్నారని, గతంలో చంద్రబాబు ఎన్నికల సమయంలో ఎన్నో అబద్ధాలు చెప్పి గెలిచిన తర్వాత ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. జగన్ పాలన ఈ రాష్ట్రచరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది అంటూ ప్రశంసించారు. మనకు సాయం చేసే, అండగా వుండే నాయకుడు జగనన్న రూపంలో దొరికారని, ఆయనకు మద్దతుగా నిలవాల్సిన అవసరం మనదరికీ ఉందని విజ్ఞప్తి చేశారు.
సామాజిక సాధికార యాత్ర ఏమిటి, దీన్ని మనం ఎందుకు చేస్తున్నామనే విషయాన్ని ప్రతిఒక్కరూ ఆలోచించాలని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి సూచించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు దాటినా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల గురించి ఆలోచించిన వారుగానీ, వారికి రాజ్యాంగంలోని హక్కులు అందించినవారుగానీ ఎవరూ లేరని…సిఎం జగన్ పాలనలోనే అది సాధ్యమైందని అన్నారు.
గాజువాకలో…
వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర పారిశ్రామికవాడ గాజువాకలో అశేష జనసందోహం మధ్య ఉత్సాహంగా సాగింది. నూతనంగా నిర్మించిన ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి గుడివాడ అమర్ నాథ్, వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కో ఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగసభకు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, ఎంపి నందిగం సురేశ్, మైనార్టీ సెల్ నాయకుడు షేక్ ఖాదర్ భాషా హాజరయ్యారు.
మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీజేపీతో పోరాటం చేయాల్సిన పవన్.. వైసీపీపై చేస్తాననడం వివేకానికి నిదర్శనమని ఎండగట్టారు. ఆయన ఏ సమయంలో ఎవరితో కులుకుతావో ఎవరికీ తెలియదన్నారు. రాష్ట్రంలో పూర్తిగా కనుమరుగై పోయేది జనసేన మాత్రమే అనడంలో సందేహం లేదన్నారు. పవన్ కల్యాణ్ జనసైనికుల ఆత్మగౌరవాన్ని తెలంగాణలో ఓ పార్టీకి, రాష్ట్రంలో మరో పార్టీకి అమ్మేస్తున్నాడని మండిపడ్డారు. ఎప్పుడు ఎక్కడ ఎవరికీ అమ్మేస్తాడో తెలియని పరిస్థితిని గమనించాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ జగన్ ను మళ్లీ సీఎం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగి రెడ్డి మాట్లాడుతూ దశాబ్ధాకాలంగా పెండింగ్ లో పడిపోయిన గాజువాక హౌస్ కమిటీ సమస్యను సీఎం జగన్ త్వరితగతిన పరిష్కరించారని వెల్లడించారు. గడపగడపకు వెళ్తే ప్రజల నుంచి అనూహ్య స్పందన, అపూర్వ స్వాగతం లభించడానికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా దక్షతే నన్నారు. సీఎం జగన్ ను ముఫ్పైఏళ్ల పాటు ముఖ్యమంత్రిని చేసుకుంటే మన భవిష్యత్తుతరాల భవిత బాగుంటుందని పిలుపు ఇచ్చారు.
కాకినాడలో
కాకినాడ రూరల్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర కి ప్రజలు పోటెత్తారు. డిప్యూటీ సిఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రులు తానేటి అనిత, పినిపే విశ్వరూపు, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపి మోపిదేవి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.