జగనన్న మన బిడ్డలను ఓ మేనమామగా చదివిస్తున్నారని, అవ్వాతాతలకు మనవడిగా నెల మొదటిరోజునే ఫించన్లు అందేలా చేశారని రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. జగనన్న ఎస్సీలకు అంబేద్కర్‌లాంటి వాడు, బోయలకు వాల్మీకి మహర్షి లాంటి వాడని అభివర్ణించారు. జగనన్న పార్టీ పెట్టకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇన్నేసి పదవులు వచ్చేవా? అని ప్రశ్నించారు. జగనన్న అమ్మఒడి ఇస్తుంటే… పిల్లికి బిచ్చం వేయని చంద్రబాబు అమ్మకు వందనం ఇస్తానంటూ హామీలు ఇస్తున్నారని విమర్శించారు. బాబు మాయ మాటలకు మోసపోమంటూ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన తరుణం వచ్చిందని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర సక్సెస్ అయ్యింది. నేతల్లో ఉత్సాహాన్ని నింపింది. మంత్రులు మేరుగ నాగార్జున, ఉషాశ్రీచరణ్, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్ యాదవ్, హఫీజ్‌ఖాన్, ద్వారకానాథరెడ్డి తదితరులు యాత్రలో పాల్గొన్నారు.
మంత్రి ఉషశ్రీచరణ్ మాట్లాడిన ముఖ్యాంశాలు:
⦿ చంద్రబాబు హయాంలో అన్నీ స్కాంలే. అందుకే ఆయన స్కాంల సీఎం.
⦿ ప్రతి క్షణం ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించే జగనన్న స్కీముల సీఎం అయ్యారు. జనం గుండెల్లో చోటు సంపాదించుకున్నారు.
⦿ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఈ ప్రభుత్వం ఎంతగా ఆదరిస్తోందో అందరికీ తెలుసు.
⦿ రామాయణ మహాకావ్యాన్ని రాసిన వాల్మీకి మహర్షి పుట్టిన రోజును పండగరోజు చేసిన ఘనత జగనన్నదే.
⦿ జగనన్న హయాంలో వెనకబడిన కులాల్లో పుట్టినందుకు మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు గర్వపడుతున్నారు.
⦿ బడ్జెట్‌లో సింహభాగం మహిళలకే కేటాయించి, వారి సాధికారత తనకున్న చిత్తశుద్దిని చాటుకున్నారు
⦿ మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అంటున్న దమ్మున్న నాయకుడు జగనన్న.
పార్వతీపురంలో
గిరిజనులకు, బడుగు, బలహీలన వర్గాలకు సీఎం జగన్ చేస్తున్న మేలును ఎన్నడూ మరిచిపోకూడదని, మరిస్తే మనకే ఇబ్బందులు, కష్టాలు వస్తాయని డిప్యూటీ సీఎం రాజన్నదొర ప్రజలకు హితవు పలికారు. ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీల కోసం జగన్ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని, గతంలో ఎన్నడైనా సరే ఇంత మొత్తంలో సంక్షేమం కోసం ఖర్చు చేశారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో కేబినెట్ లో గిరిజనులకు మంత్రి పదవి కేటాయించలేదని, జీసీసీకి చైర్మన్ ను వేయలేదని, ఎస్టీ కమిషన్ ను కూడా నియమించలేదని విమర్శించారు. పోడు, బీడు, బంజరు భూములను గిరిజనలకు జగన్ పంపిణీ చేయగా, గతంలో దీనిపై హామీ ఇచ్చిన చంద్రబాబు అమలు చేయలేదని, గిరిజనులకు రెండెకరాలు భూమి ఇస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. గిరిజనులకు మోసగించిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.
పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం నీరాజనం పలికారు. నియోజకవర్గంలో నాలుగన్నరేళ్లలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రులు, నేతలు పరిశీలించారు. డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు అలజంగి జోగారవు, మాజీ డిప్యూటీ సిఎం పాముల పుష్ప శ్రీ వాణి పాల్గొన్నారు.
పెదకూరపాడులో…
సామాజిక సాధికార యాత్రలో భాగంగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతిలో జరిగిన బహింగసభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు ఆధ్వర్యంలో జరిగిన యాత్రలో పల్నాడు ఇన్ చార్జ్ వి. విజయసాయిరెడ్డి, ఎంపిలు నందిగం సురేష్, మోపిదేవి వెంకటరమణ, లావు శ్రీకృష్ణ దేవరాయలు, మంత్రి విడదల రజిని, ఎమ్మెల్యేలు కె. పార్థసారధి, ముస్తఫా, మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.