వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయనకు విన్నవించనున్నారు. పల్నాడు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా ఈ ఘటనలపై తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గౌరవ గవర్నర్ గారు @governorap వెంటనే జోక్యం చేసుకొని అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం” అంటూ పోస్ట్ చేశారు.