ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఉమ్మడి విశాఖ జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. దీనితో పాటు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఘనమైన మెజార్టీతో విజయం సాధించేందుకు కార్యకర్తలు కంకణబద్ధులు కావాలని పిలుపు ఇచ్చారు. అనకాపల్లి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులతో స్థానిక పెంటకోట కళ్యాణ మండపంలో సోమవారం ఏర్పాటు చేసిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెల 13వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపుతో పాటు మెజార్టీ కూడా ముఖ్యమని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాలుగా సంక్షేమ పథకాలను అన్ని వర్గాల వారికి అందజేస్తున్నారని చెప్పారు. అర్హత ఉండి, పథకాలు అందని వారిని గుర్తించి వారికి కూడా లబ్ధి అందేలా చేస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని సంక్షేమ,అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అవి అసత్యాలని ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత పార్టీ శ్రేణులకు, కన్వీనర్లకు, గృహసారధులకు ఉందని చెప్పారు. సంక్షేమ పథకాల గురించి కన్వీనర్లు, గృహసారథులు ఇంటింటికీ వెళ్లి వివరించాలని ఆయన కోరారు. వైసిపి తిరిగి అధికారంలోకి రాకపోతే పథకాలన్నీ నిలిచిపోతాయని ఆయన అన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, దీనివలన ఉత్తరాంధ్ర విశేష అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుందని సుబ్బారెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని గెలిపించి, 2024 ఎన్నికల్లో వైసీపీదే విజయమన్న సంకేతాలు ప్రజలకు అందించాలని సుబ్బారెడ్డి సూచించారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అనకాపల్లి నియోజకవర్గంలో 4,711ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కు అనకాపల్లి నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు లభించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అందువల్ల పార్టీ శ్రేణులు సుధాకర్ విజయానికి కష్టపడి పని చేయాలని కోరారు.
ఈ సమావేశానికి ముందు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరులు నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
Also Read : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎండి.రుహుల్లా