రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్నామని…కానీ మా సిద్ధాంతాల విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదని, తాకట్టు పెట్టలేదని వైఎస్సార్సీపీ సేనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం సహకారం ఉంది కాబట్టే రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రం కోసం కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సఖ్యతగా ఉండాలన్నది తమ పార్టీ విధానమన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు చేసిన విమర్శలపై సుబ్బారెడ్డి స్పందించారు. రోడ్లు, బిల్డింగ్ లు మాత్రమే అభివృద్ధి కాదని, మొన్నటి దాకా తెలంగాణ కోడలినని అక్కడ రాజకీయ కార్యకలాపాలు చేసిన షర్మిల నేడు ఏపీలో తొలిరోజు పర్యటించారని, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగిందో చూసి మాట్లాడాలని సూచించారు. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశామో చూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వైఎస్సార్ ఆశయ సాధనకు ఎవరు పనిచేస్తున్నారో, ఆయన వారసులు ఎవరు అనేది ప్రజలు తేలుస్తారని వ్యాఖ్యానించారు. బాబు గత ఐదేళ్ళ కాలంలో ఎన్ని అప్పులు తెచ్చారో, ఎలాంటి అభివృద్ధి సంక్షేమం చేశారో….. తమ పాలనలో ఏమి చేశామో బేరీజు వేసుకోవాలని…. గత పాలనకూ, తమకూ పోలిక పెట్టడం సరికాదని వైవీ అన్నారు.
ఉత్తరాంధ్రనుంచే సిఎం జగన్ ఎన్నికల శంఖారావాన్ని జగన్ పూరిస్తారని, వైసీపీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమావేశం ఈనెల 27న భీమిలిలో నిర్వహిస్తున్నామని, మొత్తం 34 నియోజకవర్గాలకు చెందిన… గృహ సారథులనుంచి రాష్ట్రస్థాయి నేతల వరకూ దాదాపు 2 లక్షలమంది కార్యకర్తలు, నేతలు ఈ సభకు వస్తారు కాబట్టి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని, వెల్లడించారు.