వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, ఒరిజినల్ మూవీస్, డిజిటల్ రిలీజ్‌లు… ఏవి కావాలన్నా వీక్షకులు ముందుగా చూసే ఓటీటీ వేదిక ‘జీ 5’. ఒక్క హిందీలో మాత్రమే కాదు.. .తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. లాక్‌డౌన్ ఉన్నా, లేకున్నా మన మొబైల్, ట్యాబ్, డెస్క్ టాప్, ల్యాప్‌టాప్‌లో ‘జీ 5’ ఉంటే చాలు… వినోదానికి లోటు ఉండదు. గత ఏడాది ‘అమృత రామమ్’ నుండి మొదలుపెడితే ’47 డేస్’, ‘మేకా సూరి’, ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, ఇటీవల ‘నెట్’, ‘అలాంటి సిత్రాలు’ వరకూ ఎన్నో సినిమాలను ‘జీ 5’ డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ చేసింది. ప్రజల కోసం ప్రత్యేకంగా సినిమాలు అందిస్తోంది. ఇటీవల జీ5లో విడుదలైన ‘రాజ రాజ చోర’ ఓటీటీ మాధ్యమంలో బిగ్గెస్ట్ హిట్ సాధించింది. తాజాగా ఒరిజినల్ మూవీ ‘హెడ్స్ అండ్ టేల్స్’ను వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది.
శ్రీవిద్య మహర్షి, దివ్య శ్రీపాద, సునీల్, చాందిని రావు ప్రధాన పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ మూవీ ‘హెడ్స్ అండ్ టేల్స్’. ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. ఆ సినిమాలో నటించిన సాయికృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 22 నుండి ‘జీ 5’ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుందీ సినిమా. ప్రముఖ కథానాయిక రెజీనా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకర్షించింది. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. ‘అందరి కథలు ఒకే విధములు… కథనము మారే గతే బ్రతుకులు’ అంటూ సునీల్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది.
‘హెడ్స్ అండ్ టేల్స్’లో అనీషా పాత్రలో శ్రీవిద్య మహర్షి, మంగ పాత్రలో దివ్య శ్రీపాద నటించారు. మానవుల తలరాతలు రాసే భగవంతుడి పాత్రలో సునీల్ కనిపించనున్నారు. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ప్రతి ఒక్కరి పాత్ర తెరమీదకు వస్తుంది. ‘గాళ్ ఫార్ములా’ యూట్యూబ్ ఛానల్‌లో కంటెంట్‌తో నెటిజన్లను ఆకట్టుకున్న శ్రీవిద్య-దివ్య ద్వయం మరోసారి ఈ సినిమాతో ప్రజల ముందుకొస్తున్నారు. చాందిని రావు మరో ప్రధాన పాత్రలో నటించారు. కలర్ ఫొటో హీరో సుహాస్ సైతం ట్రైలర్ లో కనిపించారు.
నటి కావాలని కోటి కలలతో హైదరాబాద్ వచ్చిన ఒక అమ్మాయిగా శ్రీవిద్య… పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న అమ్మాయిగా దివ్య శ్రీపాద… సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిగా చాందిని రావు నటించారు. సునీల్ భగవంతుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ ముగ్గురు అమ్మాయిల జీవితాల్లో కామన్ పాయింట్ ఏంటి? అమ్మాయిలకు వాళ్ల జీవితాల్లో అబ్బాయిల నుండి ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి? తమకు ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు? అనేది సినిమా అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. “ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిది” అని ‘జీ 5’ వర్గాలు తెలిపాయి. కలర్ ఫొటో సినిమా రూపొందించిన కోర్ టీమ్ నుండి హెడ్స్ అండ్ టేల్స్ సినిమా రూపొందింది.