Friday, March 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్పాత్రికేయుల వైద్య సేవలకు నోడల్ ఆఫీసర్లు

పాత్రికేయుల వైద్య సేవలకు నోడల్ ఆఫీసర్లు

కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపధ్యంలో కరోనా మహమ్మారి బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాత్రికేయులకు వైద్య సేవలు అందించటంలో జిల్లా వైద్య యంత్రాంగానికి, పాత్రికేయులకు మధ్య అనుసంధాన కర్తలుగా పనిచేసేందుకు సమాచార శాఖ రాష్ట్ర స్థాయిలో ఒక సీనియర్ అధికారిని, జిల్లా స్థాయిలో శాఖాధిపతులను నోడల్ అధికారులుగా నియమించినట్లు సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, కోవిడ్-19 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు శ్రీ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నోడల్ అధికారులు సంబంధిత జిల్లాలలో గుర్తించిన ఆసుపత్రిలో పాత్రికేయులకు వైద్య పరీక్షల నిర్వహణ నుంచి వైద్యం అందించటం, కోవిడ్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకునే వరకు సహాయకారిగా ఉంటూ అన్ని అవసరమైన వైద్య చర్యలను తీసుకోవలసిందిగా వారిని ఆదేశించారు.
పాత్రికేయులకు వైద్యం అందించేందుకు రాష్ట్ర స్థాయిలో నోడల్ అధికారిగా సమాచార, పౌరసంబంధాల శాఖ సంయుక్త సంచాలకులు పోతుల కిరణ్ కుమార్ (మొబైల్ నెం: 9121215223) ను నియమించామని, అదేవిధంగా ప్రతి జిల్లాలో సమాచార శాఖ (ఉపసంచాలకులు/సహాయ సంచాలకులు), సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లను పాత్రికేయులకు అందుబాటులో ఉంచి ఎల్ల వేళలా వారికి సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పాత్రికేయులు విధినిర్వహణలో భాగంగా అనేక ప్రాంతాలకు వెళ్లవలసి రావటం అలాంటి సందర్భంలో మాస్క్, శానిటైజర్ లు వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాత్రికేయుల విధినిర్వహణను దృష్టిలో ఉంచుకొని వారికి వ్యాధి నిరోధక టీకా (వ్యాక్సిన్) ను వేయించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి తగు చర్యలను తీసుకోవాల్సిందిగా నోడల్ అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కోవిడ్-19 బారినపడిన పాత్రికేయులకు ప్రత్యేకంగా ఆసుపత్రులలో బెడ్లు కేటాయించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసామని తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఒక పక్క వైద్యులు కరోనా నియంత్రణకు ముందు వరుసలో నిలబడి వైద్యం అందిస్తున్నారని వారికి మీడియా కూడా సహకారం అందించాలన్నారు. కోవిడ్ బారిన పడి చనిపోయిన పాత్రికేయులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 5 లక్షలు సాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందుకు సంబంధించిన దరఖాస్తు ఫారం మరియు అన్ని వివరాలతో కూడిన డాక్యుమెంట్లను జిల్లాలోని సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులకు అందజేయాల్సిందిగా కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్