Saturday, January 18, 2025
Homeతెలంగాణఈటెల ఔట్?

ఈటెల ఔట్?

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ వస్తున్న వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు దారి తీస్తున్నాయి. హఠాత్తుగా నేటి సాయంత్రం నుంచి వివిధ న్యూస్ ఛానళ్లలో ముఖ్యంగా టీఆర్ఎస్ అధికార ఛానల్ టి-న్యూస్ సైతం ఈటెలపై కథనాలు ప్రసారం చేయడం, వెంటనే రైతులు, దళితులూ, మాజీ అధికారులు, ప్రస్తుత అధికారులు న్యూస్ చానళ్లకు అందుబాటులోకి వచ్చి ఈటెలపై చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నట్లు అర్ధమవుతుంది.

ఆరేడు నెలలుగా ఈటెల సంధిస్తున్న మాటల తూటాలు రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీస్తూ వస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను పట్టించుకోలేదనే అసహనం ఈటెలకు ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి విషయంలోనూ చివరి నిమిషం వరకూ టెన్షన్ పెట్టి గంట వ్యవధిలోనే సమాచారం ఇచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి కెటియార్, ఈటెలను వెంట బెట్టుకుని ప్రగతి భవన్ తీసుకెళ్లి ముఖ్యమంత్రితో భేటీ ఏర్పాటు చేయించినా ఫలితం లేకపోయింది.

ఈరోజు కథనాలు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి స్పందించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్ ను ఆదేశించడం. కబ్జా వ్యవహారంపై విచారణ చేయాలని విజిలెన్సు డైరెక్టర్ జనరల్ పూర్ణ చంద్రరావు ను ఆదేశించడం చకచకా జరిగిపోయాయి.

గత కొంత కాలంగా అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో తీవ్ర ఉక్కపోతకు గురవుతున్న ఈటెల రాజీనామా చేయాలా? లేదా భర్తరఫ్ చేయించుకోవాలా అనే సందిగ్ధంలో వున్నట్లు అయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్