కోవాక్సిన్, కొషీల్డ్ టికాలను సరిపడా సత్వరమే సరఫరా చేయాలని వైద్య ఆరోగ్యశాఖా డైరెక్టర్ శ్రీనివాసరావు ను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశించారు. ఉన్న ఫలంగా టెస్ట్ కిట్లను పెంచడం తో పాటు పంపాలని ఆయన సూచించారు.సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో బుధవారం మధ్యాహ్నం ఆయన కరోనా టీకా రెండో డోస్ ను తీసుకున్నారు.అనంతరం అదే ఆసుపత్రిలో కోవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న వారితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి బాగోగులు తెలుసుకోవడం తో పాటు ఆసుపత్రిలో అందుతున్న వైద్యం గురించి వాకబు చేశారు.అదే సమయంలో అక్కడి నుండేఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా తో సంభవిస్తున్న పరిణామాలపై ఉమ్మడి నల్లగొండ జిల్లా డి యం హెచ్ ఓ లతో ఆయన ఫోన్ లో సమీక్షించారు.డి యం హెచ్ ఓ లు అందించిన సమాచారం తో అక్కడి నుండే నేరుగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా డైరెక్టర్ శ్రీనివాసరావు తో మాట్లాడి సరిపడ వ్యాక్సిన్ ను సత్వరమే సరఫరా చేయాలని ఆదేశించారు. అంతే గాకుండా హెటిరో యం డి తో ఫోన్ లో సంప్రదించి తగినంత రేమిడిసివర్ ను వెంటనే పంపించాలని కోరారు. ఆసుపత్రిలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ ను స్వయంగా ఆయన పరిశీలించారు. కోవిడ్ పేషంట్ల తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ పాజిటివ్ అని తెలంగానే పరేశాన్ కావొద్దని సూచించారు. భయాందోళననే మనిషిని ఆగం చేస్తుందన్న విషయాన్ని గుర్తించాలని ఆయన కోరారు.మానసిక ధైర్యమే కరోనా పై విజయానికి మందు లాగా పనిచేస్తుందన్నారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషంట్ల బంధువులతో ఏరియా ఆసుపత్రి బయట మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి వారికి భరోసా ఇచ్చారు.