విద్యార్థుల గురించి తనకన్నా ఎక్కువ ఆలోచించే వారు ఎవరూ ఉండరని, వారి భవిష్యత్తు కోసమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది ‘జగనన్న వసతి దీవెన’ తొలి విడత నిధులను సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లలో జమ చేశారు. విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఆర్ధిక సాయం అందించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ పధకాన్ని అమలు చేస్తోంది.
పరీక్షల నిర్వహణ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం…. రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలిందని వివరించారు. పరీక్షల విషయమై కొన్ని రాజకీయ పార్టీలు, నేతలు విమర్శలు చేయడం సరికాదని, పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులు భవిష్యత్ లో చాలా నష్ట పోవాల్సి వస్తుందని చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కష్ట సాధ్యమైనా, ముందు చూపుతో ఆలోచించే పరీక్షలు నిర్వహించేందుకు ముందడుగు వేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.