నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. సాగర్ ఉపఎన్నికల్లో మొత్తం 1,89,782 ఓట్లు పోలవ్వగా టిఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ 87,254 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి కె. జానారెడ్డి 68,714 ఓట్లు, బిజెపి అభ్యర్ధి 7,159 ఓట్లు సాధించారు, నోముల భగత్ సమీప అభ్యర్థి జానారెడ్డిపై 18,449 మెజార్టితో విజయం సాధించారు. బిజెపి అభ్యర్ధి డిపాజిట్ కోల్పోయారు.
కెసియార్ కృతఙ్ఞతలు
టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు ఆశీర్వచనమిచ్చి, భారీ మెజారిటీతో గెలిపించినందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ సిఎం కెసిఆర్ హృదయపూర్వక కృతజ్జతలు, ధన్యవాదాలు తెలిపారు.
టిఆర్ఎస్ ప్రభుత్వ విధానం ప్రకారం, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తామని సిఎం తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్ తోపాటు నాగార్జున సాగర్ నియోజక వర్గం సందర్శించి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని సిఎం స్పష్టం చేశారు.
దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధుల్లో ఇటీవల మంజూరు చేసిన లిఫ్టు ఇరిగేషన్ స్కీంలను శరవేగంగా పూర్తిచేసి ప్రజలకు నీరందిస్తామని సిఎం తెలిపారు. ఎన్నికల సందర్భంలో పార్టీ నాయకులు సేకరించిన ప్రజా సమస్యన్నింటిని కూడా సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఎవరు ఎన్నిరకాల దుష్ప్రచారం చేసినా.. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తమ విశ్వాసాన్ని ప్రస్పుటంగా ప్రకటించిన ప్రజలకు సిఎం హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
రెట్టించిన ఉత్సాహంతో మున్ముందు ప్రజాసేవకు టిఆర్ఎస్ పార్టీ మరింతగా పునరంకితమౌతుందని.. సిఎం మారోమారు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
విజయం సాధించిన అభ్యర్ధి నోముల భగత్ కు సిఎం కెసిఆర్ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. చక్కగా ప్రజాసేవ చేసి మంచి రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని నోముల భగత్ కు సిఎం సూచించారు.
నోముల భగత్ విజయం కోసం కృషి చేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సిఎం అభినందనలు తెలిపారు.