ఉపాధ్యాయులకు విద్యాయేతర విధుల నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారి విధుల విషయంలో కీలక సవరణలు చేసింది. దశాబ్దాలుగా ఉపాధ్యాయులు చేస్తున్న ఎన్నికల విధులు, జన గణన వంటి విధుల నుంచి ఇక మినహాయింపు లభించనుంది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మంత్రుల నుంచి వర్చువల్‌గా సంతకాలు సేకరించింది. దీనిపై గెజిట్ నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది.
ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వనున్నారు. తమకు బోధనేతర బాధ్యతలు భారం తగ్గించాలని వివిధ సందర్భాల్లో ఉపాధ్యాయ సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఈ సవరణ చేశామని చెప్పిన ప్రభుత్వం రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం రూల్స్ సవరిస్తూ కూడా ఉత్తర్వులు ఇచ్చింది.
ఉపాధ్యాయులు అకడమిక్ అచీవ్మెంట్ లెవెల్ పెంచేందుకే, బోధనేతర, విద్యేతర బాధ్యతలేవి అప్పగించకూడదని నిర్ణయం తీసుకున్నామని, ఇతర ప్రభుత్వ ఉద్యోగులంతా విధులకు నియమించి, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వారికి బోధనేతర విధులను అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.