భారత్ జోడో యాత్రలో ఏఐసీసీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ పాల్గొన్నారు. ఈ తెల్లవారు జామునే ఆమె రాహుల్ గాంధీని కలిశారు. ఇద్దరూ కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ సహా పలువురు నాయకులు సోనియాను కలిశారు. ఆమెతో కలిసి నడక మొదలు పెట్టారు. ఇవ్వాళ ఈ యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గేలు పాల్గొనటంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చింది. వచ్చే సంవత్సరం కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌కు పాదయాత్ర కీలకంగా మారింది.
ఈ రోజు (గురువారం) ఉదయం 6.30 గంటలకు తిరిగి పాండవపుర తాలూకాలోని బెల్లాలే గ్రామం నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. ఉదయం 11గంటల వరకు నాగమంగళ తాలూకా చౌడేనహల్లి గేట్ వద్దకు యాత్ర చేరుతుంది. సాయంత్రం 4:30 గంటలకు యాత్ర తిరిగి ప్రారంభమై 7గంటలకు బ్రహ్మదేవరహల్లి గ్రామం వద్ద సభలో రాహుల్ ప్రసంగిస్తారు. రాత్రి నాగమంగళ తాలూకా ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి ఎదురుగా మడకే హోసూర్ గేట్ వద్ద రాహుల్, ఆయన బృందం బస చేస్తారు.
మూడు రోజుల కిందటే సోనియా గాంధీ కర్ణాటక చేరుకున్న విషయం తెలిసిందే. మడికెరి, మైసూరుల్లో బస చేశారు. విజయదశమి సందర్భంగా మైసూరు జిల్లాలోని బేగూర్ వద్ద గల ప్రఖ్యాత భీమనకొల్లి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు.
ఇదే యాత్రలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఆమె ఎప్పుడు యాత్రలో పాల్గొంటారనేది ఇంకా ఖరారు కాలేదు.
Also Read : కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లో.. భారత్ జోడో యాత్ర జోష్