Dias-Dignity: హైదరాబాద్ లో దత్తాత్రేయ నిర్వహించిన ‘అలాయ్ బలాయ్’ వేదిక మీద ఏమి జరిగిందో అందరూ చూశారు కాబట్టి… సహస్రావధాని గరికపాటి అలా అనకూడదా? హీరో చిరంజీవి అలా వేదిక మీద ఫోటోలకు ఫోజులివ్వకూడదా? అన్న చర్చ అనవసరం.
కొన్ని వాదనల్లో-
1. నీ వైపు
2. నా వైపు
3. నిజం వైపు
మూడు పార్శ్వాలూ ఉండవచ్చు.
ఒక ప్రవచనకర్తగా గరికపాటి మాట్లాడుతుండగా ఎంతసేపయినా చిరంజీవి ఫోటో సెషన్ పూర్తి కాక, వేదిక మీద రణగొణ తగ్గక అసహనంతో…నిరసనగా గరికపాటి అలా అన్నారు- ఒక వాదన.
అభిమానులు పులకింతతో, తన్మయత్వంతో, ఉత్సాహంగా సెల్ఫీలు అడిగితే కాదనలేక చిరంజీవి అలా చేశారే తప్ప, అందులో ఎలాంటి దురుద్దేశం లేదు. మరొకరిని తక్కువ చేయడం కానే కాదు. చిరంజీవి లాంటి సంస్కారం పోతపోసిన సెలెబ్రిటీని గరికపాటి అంతలేసి మాటలు అనకూడదు- మరొక వాదన.
వెనువెంటనే చిరంజీవి హుందాగా, అనునయంగా మాట్లాడి వాతావరణాన్ని చల్లబరిచారు. అక్కడితో ఆగిపోయి ఉంటే…చిరంజీవి సంస్కారం ఆకాశానికి ఎగబాకి…గరికపాటి సంస్కారమే చిన్నబోయేది.
ఇంతకంటే ఈ వివాదం పెరగకూడదనుకుని గరికపాటి కూడా తను అలా అని ఉండాల్సింది కాదని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇక్కడికి ఈ కథ ఆగిపోయి ఉంటే బాగుండేది. నిజానికి దీనికి అదే గౌరవప్రదమయిన ముగింపు అయి ఉండేది.
చిరంజీవి తమ్ముడు నాగబాబు, నటుడు ఉత్తేజ్, గేయ రచయిత అనంత్ శ్రీరామ్, చిరంజీవి వీరాభిమానులు గరికపాటిని చిత్ర, విచిత్రమయిన ప్రాసలు, యాసలు, పిట్టకథలతో విమర్శించడం మొదలు పెట్టి…దీన్ని సజీవంగా ఉంచుతూ చిరంజీవి కీర్తిని మసకబార్చడానికి కంకణం కట్టుకున్నారు.
ఇందులో ఎవరి మాట ముందు? ఏది వెనుక? దేనికి ఏది ప్రతిస్పందన? పశ్చాత్తాపం ఎప్పుడు? అని నిముషాలతో పాటు కాలప్రమాణాలను లెక్కగట్టి గుణదోష నిర్ణయం చేసే గణాచారులు కూడా బయలుదేరారు.
“ఏ పాటివారికయినా ఆ పాటి అసూయ”
-నాగబాబు
“…అన్నట్టు…
సరస్వతమ్మ అందరికీ ఇచ్చినట్టే మీకిచ్చిన..”
-ఉత్తేజ్
“గరిక- బ్రహ్మాస్త్రం”
-అనంత్ శ్రీరామ్
ఇంకా చాలా నీచమయిన కామెంట్లు, సంస్కార రాహిత్యమయిన తిట్లు చాలా ఉన్నాయి. వాటిని మళ్లీ ప్రస్తావించడం కూడా దోషం.
“మీ ప్రవచనాలు ఎన్నో విన్నాను. మీరంటే గౌరవం. మీకు కుదిరినప్పుడు మా ఇంటికి భోజనానికి రండి” అని గరికపాటిని ఆహ్వానించిన చిరంజీవి సంస్కారం పాలకుండలో నాగబాబు వేసిన “ఆపాటి ఈపాటి” ఏపాటి చుక్కలో నాగబాబే గ్రహించాలి.
“సరస్వతమ్మ అందిరికీ ఇచ్చినట్లే మీక్కూడా ఇచ్చిన విద్య” అని గరికపాటి ఏ రకంగానూ గొప్ప కాదని తేల్చేసిన ఉత్తేజ్ తన సారస్వత విద్యను తనే బయటపెట్టుకున్నారు.
ఇక అనంత్ శ్రీరామ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చిరంజీవి ప్రాపకం కోసం గరికపాటికి హితవు చెప్పేంత పెద్దవాడు అయిపోయారు అనంత్ శ్రీరామ్. వాల్మీకి రామాయణంలో కాకాసుర వృత్తాంతంలో ఒకే ఒక గడ్డి పరకను రాముడు అభిమంత్రించి వదిలితే అది బ్రహ్మాస్త్రమయ్యింది. దాన్ని గరికపాటి మీదికి అభిమంత్రించడానికి అనంతుడు పడ్డ గరికాన్వయ బాధ వర్ణనాతీతం. బహుశా నెక్స్ట్ అనంత్ శ్రీరామ్ రాయబోయే గీతాల నిండా గరిక బోధ; గరికా గీతం; గురి తప్పిన గరిక; చించి అదిలించి విదిలించి అతికించి కుళ్ళబొడిసింది సాలు తీ…గరికా! నా సాగరికా! సాగనే సాగ రిక! లాంటి గరికా పరిభాషే ఉండవచ్చు!
తన భజన బృందాన్ని నియంత్రించకపోతే చిరంజీవి స్వశక్తితో ఇటుక ఇటుక పేర్చుకుని నిర్మించుకున్న సంస్కార కీర్తి శిఖరానికే ప్రమాదం. గరికపాటులకు పోయేదేముంది? గోచీ తప్ప!
ఇకపై- ఏ వేదిక తనకు అనువో? ఏ వేదిక అనువు కాదో గరికపాటికి కూడా అలాయ్ బలాయ్ వేదిక స్పష్టంగా తెలియజేసి ఉంటుంది.
ఫలశ్రుతి:-
ఒకానొక చోటికి ఎందుకు వెళ్లకూడదో పరమశివుడు సవివరంగా చెప్పినా సతీదేవి వినకుండా వెళతానంటుంది. అయిష్టంగా శివుడు సరే అన్నాడు. అమ్మ వెళ్లింది. మాట పడింది. అవమానం భరించలేక తనను తాను దహించుకుంది.
ప్రతి పురాణమూ ఒక పాఠమే- గ్రహిస్తే!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :
Also Read :