Thursday, March 28, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆదిలోనే హింసపాదు

ఆదిలోనే హింసపాదు

Liberty-Limits: చదవడం, వినడం, చూడడం వేరు వేరు పనులు. ఏక కాలంలో చదువుతూ వినవచ్చు. వింటూ చూడవచ్చు. చదువుతున్నప్పుడు దాన్ని … కదలని చిత్రంగానో, కదిలే దృశ్యంగానో భావించుకునే అవకాశం ఉంటుంది. ఒక భావనగా నిర్మించుకోవచ్చు. వింటున్నప్పుడు కూడా వింటున్నది ఊహించుకోవచ్చు. చూస్తున్నప్పుడు మాత్రం కంటికి ఏది కనపడుతుందో అదే రిజిస్టర్ అవుతుంది.

సులభంగా అర్థం కావడానికి ఇలా అనుకుందాం. హిమాలయాల గురించి రాసిన ఒక పుస్తకం, ఒక ఆడియో న్యూస్, ఒక వీడియో డాక్యుమెంటరీ ఉన్నాయి. పుస్తకం చదివి హిమాలయాలను మెదడులో, మనసులో విజువలైజ్ చేసుకోవచ్చు. ఆడియో న్యూస్ విని అదే పని చేయవచ్చు. వీడియో డాక్యుమెంటరీ చూసి తెలుసుకోవచ్చు. ఇందులో ఒక్కో మాధ్యమానికి కొన్ని అనుకూలతలు, కొన్ని అననుకూలతలు ఉంటాయి.

జీవితమంతా హిమాలయాల గురించి చదివి…చదివి…ఎంతో ఊహించుకున్న వ్యక్తి తొలిసారి ప్రత్యక్షంగా హిమాలయాలను చూసినప్పుడు…అది తన ఊహకంటే గొప్పగా ఉండవచ్చు. తన ఊహ ముందు ఎందుకూ కొరగాక పోవచ్చు. ఇందులో హిమాలయం తప్పేమీ లేదు. అది ఉన్నది ఉన్నట్లే ఉంది. ఊహకు పెట్టుబడి లేదు. శ్రమ లేదు. పరిమితుల్లేవు. కాబట్టి ఎలాగయినా ఊహించుకోవచ్చు. కథ, నవల చదివేప్పుడు ఆ పాత్రలను ఊహించుకుంటూ…వాటి వెంట వెళ్లినట్లు…హిమాలయం గురించి రాసింది చదువుతూ…అణువణువూ ఊహించుకుంటాం. తీరా అక్కడికెళ్లాక ఎముకలు కొరికే చలికి గజ గజ వణుకుతూ…మంచు మీద పడ్డ తెల్లటి ఎండ రిఫ్లెక్షన్ కంటి మీద పడగానే కళ్లు మూతలు పడి, వేళ్లు వంకర్లు పోయి నిలుచున్న చోట క్షణం నిలబడలేక…ఏమీ చూడలేక మనమీద మనకే జాలి కలగవచ్చు. ఒకవేళ చూడగలిగినా…ఏ హెలికాఫ్టర్లోనో వెళితే తప్ప దాని అసలయిన అందం కంట్లో పడకపోవచ్చు.

సరయిన వీడియో డాక్యుమెంటరీ చూసినప్పుడు…ఆ అనుభూతి వేరు. నేపథ్య వ్యాఖ్యానం(వాయిస్ ఓవర్), ఇతర అంకెలు, తేదీలు, పోలికల్లాంటి వివరాలు అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ప్రత్యక్షంగా చేసినదానికంటే వీడియోనే గొప్పగా ఉండవచ్చు.

మన పురాణాలు, ఇతిహాసాలు, ప్రబంధ కావ్యాల్లో ఉన్న పాత్రలు ఇప్పుడు సజీవంగా మన కళ్ల ముందు లేవు. కానీ…చదివి…చదివి, వినీ…విని…ఆయా పాత్రలను మన మనస్సులో ప్రతిష్ఠించుకున్నాం. నరనరాన జీర్ణమైపోయాయి. రాముడు, కృష్ణుడు, భీముడు, సీత, లవకుశులు, లక్ష్మి, పార్వతి, హనుమ, దుర్గ, రావణుడు, శూర్పణఖ, దుర్యోధనుడు, కుంభకర్ణుడు, వరూధిని, ప్రవరాఖ్యుడు…పాత్ర ఏదయినా ఈ దేశ ప్రజలకు పరిచయమే. హిందువులకు ఆయా రూపాలు పరమ పవిత్రం. రాముడి భుజం మీద గద ఉండదు. భీముడి చేతిలో కోదండం ఉండదు. సీతమ్మ చెంత సింహం ఉండదు. దుర్గమ్మ ఆసనంగా నెమలి ఉండదు. సరస్వతి చేతి మీద చిలుక ఉండదు. పార్వతి చేతిలో పుస్తకం ఉండదు. ఏ దేవత, ఏ పాత్ర వేషం ఎలా ఉంటుందో? ఎలా ప్రవర్తిస్తుందో? వారి అలంకారాల్లో ఏవి ఉండాలో? ఏవి ఉండకూడదో? అందరికీ బాగా తెలుసు.

మనకు ఆదికావ్యం వాల్మీకి రామాయణం. నారదుడి నోట విన్న కథను వాల్మీకి దర్శించి…అనుభవించి రామాయణంగా రాశాడు. ఒక్కో పాత్ర మనసులో ఏమనుకుంటుందో కూడా నీకు తెలుస్తుంది…ఈ భూమ్మీద నదులు, కొండలు ఉండేదాకా నిలిచి ఉండేలా రామాయణం రాస్తావు…అని ఆయనకు బ్రహ్మ ఇచ్చిన వరమని ఆయనే ఒకచోట స్పష్టంగా చెప్పుకున్నాడు. భారతీయ భాషలన్నిటిలోకి వాల్మీకి రామాయణం అనువాదమయ్యింది. అనేక వ్యాఖ్యాన గ్రంథాలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. భవిష్యత్తులో కూడా వస్తాయి. వివిధ సాహితీ, సంగీత, కళా రూపాల ద్వారా కూడా రామాయణం ప్రవహిస్తూనే ఉంది.

రామబాణం ఒక మహా కావ్యం. రామ పాదం ఒక మోక్షం. శివ ధనుర్భంగం ఒక మెరుపు. హనుమ సముద్ర లంఘనం ఒక విరుపు. గుహుడు ఒక మైమరపు. శబరి ఒక పిలుపు. మంథర ఒక మెలిక. కైకేయి ఒక మలుపు. అరణ్యవాసం ఒక మజిలీ. చుక్కల బంగారు జింక ఒక ఎర. పుష్పక విమానం ఒక అద్భుతం. లంకా దహనం ఒక అవసరం. రావణ సంహారం ఒక ముగింపు. ఇలా దేనికదిగా అన్ని ఘట్టాలూ ప్రత్యేకమయినవే. అందరూ ప్రత్యేకమయినవారే. ఇంతగా తెలిసిన రామాయణమే మళ్లీ మళ్లీ ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాం? ఈ ప్రశ్నకు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తిరుగులేని సమాధానం చెప్పారు. రోజూ తినే అన్నమే మళ్లీ మళ్లీ తింటుంటాం. రోజా మునిగి తేలే సంసారంలోనే మళ్లీ మళ్లీ మునిగి తేలుతూ ఉంటాం. అలా రామాయణం మన జీవన పారాయణం.

అలాంటి బాగా తెలిసిన ఈ పాత్రలను సినిమాల్లోకి ఎక్కించేప్పుడు ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు తడబాటు ఎందుకు ఎక్కువవుతోంది? అలజడి ఎందుకు పెరుగుతోంది? ఆందోళనలు, నిరసనలు ఎందుకు పెరుగుతున్నాయి? అన్నది ఇప్పుడు చర్చ.

మిగతా సినిమాల పురాణం పక్కన పెడదాం. ఆది పురుష్ గురించి మాత్రమే చూద్దాం. ఆది పురుష్ ట్రయిలర్ వచ్చింది. మర్యాదా పురుషోత్తముడు, ఉత్తమ పురుషుడయిన రాముడిని ఆది పురుష్ గా చూపించదలుచుకున్నారు. సంతోషం. దానికి బాహుబలితో భూగోళం పట్టనంతగా ఎదిగిన ప్రభాస్ ను హీరోగా తీసుకున్నారు. అది కూడా సంతోషం.

ఈ సినిమా దర్శకుడికి రామాయణం గురించి తెలిసింది ఎంత? రాముడి మీద భక్తి తరువాత సంగతి… గౌరవాభిమానాలయినా ఉన్నాయా?

రాముడు, కృష్ణుడి వేషాలు వేసేప్పుడు ఆ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసిన ఎన్ టీ ఆర్ దినచర్య, ఆహారపుటలవాట్లు ఎలా ఉండేవి?

ఆది పురుష్ షూటింగ్ అప్పుడు హీరో ప్రభాస్ దినచర్య, ఆహార విహారాలు ఎలా ఉన్నాయి? లాంటి ప్రతి చిన్న విషయం ఇప్పుడు బహిరంగ రహస్యం. దాచాలన్నా ఏదీ దాగని రోజులు. వ్యక్తిగత అలవాట్ల చర్చ ఇక్కడ అనవసరం. నటన ఒక వృత్తి అయినప్పుడు…బాగా నటించి పాత్రకు జీవం పోశారా? లేదా? అన్నదే కొలమానమవుతుంది తప్ప మిగతా విషయాల జోలికి వెళ్లాల్సిన పని లేదు.

సామాజిక మాధ్యమాల్లో ఆది పురుష్ మీద జరుగుతున్న చర్చలో ప్రధానాంశాలివి:-

 Adipurush Criticism

1. రాముడికి మీసాలున్నాయి.
2. రావణాసురుడిని దక్షిణాదివాడిగా చూపించే ప్రయత్నం చేశారు.
3. రావణాసురుడి కంటి చుట్టూ ముస్లిములు పెట్టుకునే సుర్మా- కాటుక ఉంది.
4. రావణుడి హెయిర్ స్టయిల్ కూడా హిందూ మతానికి వ్యతిరేకంగా ఉంది.
5. రావణాసురుడు వికృత పక్షి వాహనం మీద తిరిగాడా?
6. హనుమ వికృతంగా ఉన్నాడు. ఎలుగుబంటిలా చిత్రీకరించారు.
7. రాముడు- సీతల మధ్య ఆధునిక సినిమా రొమాన్స్ లాంటి సన్నివేశాలను సృష్టించారు.
8. జటాయువు యానిమేషన్లో వికృత రూపం పొందింది.
9. యానిమేషన్ దృశ్యాలు చాలా నాసిరకంగా ఉన్నాయి.

ఈ అభ్యంతరాల్లో కొన్ని సిల్లీగా అనిపించవచ్చు. రావణ రూపం, హనుమ ఎలుగుబంటిలా ఉండడం, జటాయువు వికృత రూపం మాత్రం తోసిపుచ్చడానికి వీల్లేని విషయాలు.

హనుమ తొలిసారి రావణుడిని చూసినప్పటికి…అతడు తెల్లటి పట్టు పరుపు మీద పడుకుని ఉన్నాడు.

“అబ్బో!
ఏమి రూపం?
ఏమి తేజం?
ఎంత ధైర్యం?
అధర్మం అన్న ఒక్క అవలక్షణం లేకపోతే ఈ రావణుడు ఇంద్రుడికంటే గొప్పవాడయ్యే వాడే…” అని హనుమ మనసులో అనుకున్నట్లు వాల్మీకి చెబుతాడు.

ఇక్కడ…
అబ్బో! ఏమి రూపం? ఏమి తేజం? ఏమి ధైర్యం?
వెలుగుతున్న చమురు దీప శిఖ గాలికి కదిలినా రావణుడికి కోపం వస్తుందని వాయుదేవుడు భయపడి జాగ్రత్త పడుతున్నాడు…లాంటి మొత్తం మాటలను బట్టి ఆ సన్నివేశాన్ని…అప్పుడు రావణుడున్న స్థితిని, అక్కడ పట్టు పరుపు, వెలిగే దీపాలు, కిటికీలు, మంచాల అమరిక, తప్పతాగి ఒంటిమీద బట్టలు జారి…ఒకరి మీద ఒకరు పడుకున్న కాంతలు…ఇలా ఊహించుకున్నవారికి ఊహించుకున్నంత.

దీన్నే సృజనాత్మక స్వేచ్ఛ(క్రియేటివ్\సినిమాటిక్ లిబర్టీ) పేరిట…
రావణుడు నైట్ డ్రస్ నిక్కర్, టీ షర్ట్ వేసుకుని హోం థియేటర్లో నేషనల్ జాగ్రఫీ ఛానెల్ చూస్తూ రిక్లయినర్ సీట్లో వాలిపోయినట్లు;
జీన్స్ ప్యాంట్, లెదర్ జాకెట్ వేసుకుని హనుమ చెవుల్లో వైర్లెస్ ఇయర్ ఫోన్స్ వింటూ విండో స్లయిడింగ్ డోర్ పక్కకు జరిపి రావణుడిని చూసి…
హే రామ్! ఐ గాట్ బ్లడీ రావణ్…అని అన్నట్లు చిత్రీకరించారనుకోండి. చూడగలమా? చూసి జీర్ణించుకోగలమా?

 Adipurush Criticism

పురాణ, చారిత్రిక పాత్రల బలమే వాటి వేష భాషలు. శ్రీ కృష్ణదేవరాయలు సింహాసనం మీద కూర్చుని, ముత్యాల తలపాగా పెట్టుకుని ఐ ప్యాడ్ జూమ్ కాల్లో అష్టదిగ్గజ కవులతో సాహితీ చర్చ పెట్టినట్లు చిత్రీకరిస్తే ఎందుకు అంగీకరించం? ఆ కాలానికి ఐ ప్యాడ్ జూమ్ కాల్ లేదని మనకు తెలుసు కనుక.

అలాగే రామాయణం విషయంలో కూడా ఎవరు ఎలా ఉంటారో? వారి వేష భాషలేమిటో? మనకు తెలుసు కాబట్టి…వాటికి భిన్నంగా ఉన్న దేన్నీ మనం అంగీకరించలేం. అంగీకరించాల్సిన అవసరం కూడా లేదు.

ఈ చిన్న పాయింట్ ను ఆది పురుష్ టీం అర్థం చేసుకోలేక దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న విమర్శలు బాధిస్తున్నాయని గుండెలు బాదుకుంటోంది.

ఇది ట్రెయిలరే.
అభీ పిక్చర్ బాకీ హై.
ఆ రామాయణం ఎలా ఉంటుందో?

హే! రామ్!!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

రాజకీయ దూరం, దగ్గర

Also Read :

పుష్పక విమానం

RELATED ARTICLES

Most Popular

న్యూస్