Saturday, January 18, 2025
HomeTrending Newsఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలుగు ఐఏఎస్ ?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలుగు ఐఏఎస్ ?

ఢిల్లీ లిక్కర్ కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  ఢిల్లీ మద్యం కుంభకోణం మాఫియాతో కుమ్మక్కై అక్రమంగా కోట్ల రూపాయలు వెనకేసుకున్నారన్న కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణతో పాటు డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారిని సస్పెండ్ చేస్తూ సోమవారం కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. ఇద్దరు అధికారులపై కేసు సిబిఐ కేసు నమోదు చేసింది.  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సైతం ఈ కేసుతో లింకులు ఉన్నట్టు ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది.

ఢిల్లీ ఎక్సైజ్ శాఖకు గతంలో కమిషనర్‌గా సేవలు అందించిన అరవ గోపీకృష్ణను కేంద్ర హోంశాఖ సస్పెండ్ చేయడంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఏపీ, తెలంగాణకు సంబంధాలు ఉన్నాయని వినిపిస్తున్న ఆరోపణలకు బలం చేకూనట్టయింది. తాజాగా కేంద్ర హోంశాఖ చేతిలో సస్పెన్షన్ వేటుకు గురైన ఐఏఎస్ ఆఫీసర్ అరవ గోపీ కృష్ణ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారే కాగా.. ఆయనకు ఏపీ, తెలంగాణలో అనేక మంది రాజకీయ ప్రముఖులు, వీఐపీలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ 13 మందిపై కేసులు నమోదు చేయగా.. అందులో గోపీకృష్ణ పేరు కూడా ఉంది.

ఇటీవలే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 వ్యవహారంలో తీవ్ర లొసుగులు ఉన్నాయని గుర్తించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. అందుకు బాధ్యులైన 11 మంది ఉన్నతాధికారులపై శాఖపరంగా కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు అవసరమైన అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ పాలసీ అమలు చేసిన అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణ, ఆయనకు సహకరించిన డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారిలపై కన్నెర్ర చేస్తూ తాజాగా కేంద్ర హోంశాఖ వారిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

Also Read : ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం లేదు కవిత

RELATED ARTICLES

Most Popular

న్యూస్