మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లో ఈ రోజు (శనివారం) ఉదయం 6.14 గంటలకు ఉఖ్రుల్‌లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఉఖ్రుల్‌కు 94 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నది. దీనివల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు ప్రకటించారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలో శుక్రవారం రాత్రి భూమి కంపించింది. దీనిప్రభావంతో హర్యానాలో కూడా ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 3.2గా నమోదయింది. భూకంప కేంద్రం చెరకు పంట సాగుకు పేరొందిన షామ్లీకి 77 కిలోమీటర్ల దూరంలో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. భూఅంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. భూప్రకంపనలతో ఇరు రాష్ట్రాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. అయితే ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు చెప్పారు.