దళిత వర్గానికి చెందిన 80 ఏళ్ల మల్లిఖార్జున ఖర్గే.. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి కలబురిగి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడు పర్యాయాలు సీఎం అవకాశాలను కోల్పోయినా ఏమాత్రం నిరాశ చెందలేదు. పార్టీపై తిరుగుబావుటా ఎగరేయలేదు. అధిష్ఠానం ఆదేశాల మేరకు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ప్రారంభం నుంచి గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడిగా పని చేస్తున్న ఖర్గేకు మంచి పేరుంది. ఈ నేపథ్యంలో రాజకీయ అనిశ్చితిని తొలగించేందుకు గాంధీ కుటుంబమే ఖర్గేను బరిలోకి దించుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
137 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసులోకి అనూహ్యంగా అడుగుపెట్టిన ఆ పార్టీ రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి అయిన తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌పై గెలుపొందారు. ఖర్గేకు 7వేలకుపైగా ఓట్లు రాగా.. థరూర్‌కు వెయ్యికిపైగా ఓట్లు వచ్చాయి.
ఖర్గే విజయంపై అధికారిక ప్రకటన వెలువడక ముందే.. ఓటమిని అంగీకరిస్తున్నట్లు థరూర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఓ కీలక బాధ్యతని.. దాన్ని సక్రమంగా నిర్వర్తించడంలో ఖర్గే సఫలం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు థరూర్.
అధ్యక్ష ఎన్నికకు అక్టోబరు 17న పోలింగ్ చేపట్టగా.. దేశవ్యాప్తంగా దాదాపు 9,500 మంది (96శాతం మంది) పార్టీ ప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు . అన్ని రాష్ట్రాల్లోని బ్యాలెట్ బాక్సులను దిల్లీకి తీసుకొచ్చి బుధవారం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ఆధ్వర్యం లెక్కింపు చేపట్టారు.
Also Read : కాంగ్రెస్ అధ్యక్షుడుగా మల్లిఖార్జున ఖర్గే