Wednesday, June 26, 2024
HomeTrending Newsమెయిన్ పురి నుంచి డింపుల్ యాదవ్ నామినేషన్

మెయిన్ పురి నుంచి డింపుల్ యాదవ్ నామినేషన్

ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురి లోక్ సభ స్థానం నుంచి సమాజ్ వాది పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డింపుల్ యాదవ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నాయకురాలు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఉప ఎన్నికల బరిలో నిలవటంతో పోటీ రసవత్తరంగా మైంది. తన మావయ్య, దివంగత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్ పురి లోక్ సభ స్థానానికి  డింపుల్ యాదవ్ పోటీ చేస్తారని పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఇదివరకే ప్రకటించారు.

నామినేషన్ దాఖలుకు ముందు ములాయం సింగ్ యాదవ్ సమాధి వద్ద డింపుల్ యాదవ్, అఖిలేశ్ యాదవ్ పుష్పాంజలి ఘటించారు. సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా భావించే మెయిన్‌పురి స్థానానికి డిసెంబర్ 5 న పోలింగ్ జరగనుండగా అదే నెల 8న ఫలితాలు వెల్లడించనున్నారు. డింపుల్ నామినేషన్లు దాఖలు చేయడానికి ముందు, వివిధ పార్టీ కార్యకర్తలు, నాయకులు అఖిలేశ్ యాదవ్ నివాసాన్ని సందర్శించారు. అయితే ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా డింపుల్ నామినేషన్ దాఖలు చేశారు.

డింపుల్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, పార్టీ సీనియర్ నేత రామ్ గోపాల్, ధర్మేంద్ర యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ తదితర నేతలు హాజరయ్యారు. అయితే బాబాయి శివపాల్ యాదవ్ ఆయన కుమారుడు ఆదిత్య యాదవ్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరు కాకపోవటంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అందరం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని అఖిలేష్ స్పష్టం చేశారు.  మెయిన్ పురి ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 17 కాగా,  21 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.

Also Read : మెయిన్‌పురి లోక్‌సభ, ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్