కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు, ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. అక్టోబర్ 17న పోలింగ్ నిర్వహించగా.. ఈ రోజు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఉదయం 10 గంటలకు బ్యాలెట్ బాక్సులు తెరిచి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ పేపర్లను కలిపేశారు. ఏ రాష్ట్రానికి చెందిన బ్యాలెటో తెలియకుండా పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత లెక్కింపు ప్రారంభించారు. 9,915 ఓటర్లను ఏఐసీసీ గుర్తించగా.. ఇందులో 9,500పైగా ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 1.00 గంట తర్వాత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది.
మల్లికార్జున ఖర్గేకి 7,897 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్ధి శశిథరూర్ కు కేవలం 1072 ఓట్లు మాత్రమే వచ్చాయి. 416 ఓట్లు చెల్లుబాటు కాలేదు. మల్లిఖార్జున ఖర్గే విజయంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏఐసీసీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన ఖర్గేకు ఎన్నికల్లో పరాజయం పాలైన శశిథరూర్ అభినందనలు తెలిపారు. శశిథరూర్ ఖర్గే నివాసానికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. అంతకు ముందు ఆయన అభినందనలు తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు. ‘నిజమైన పార్టీ పునరుద్దరణ ప్రక్రియ ఈ రోజుతో మొదలైనట్టు నేను భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
24 ఏళ్లు సుదీర్ఘ విరామం తర్వాత నెహ్రూ, – గాంధీ కుటుంబేతర నేత కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఈ నెల 17వ తేదీన అధ్యక్ష పదవికి పోలింగ్ జరిగింది.