ప్రతిపక్ష పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీ ఎప్పుడో 2019లో ఎన్నికల ప్రచారంలో అన్న మాటను తప్పుపడుతూ వేసిన కేసును ఇప్పుడు తిరగదోయటం కుట్ర పూరితమని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేసును వాయిదా వేస్తూ చట్టసభకు అర్హత లేని విధంగా చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా శిక్ష విధించాలని భారతీయ జనతా పార్టీ చేసిన కుట్ర నిన్న బహిర్గతమైందని విమర్శించారు. నిన్న ఒక చీకటి దినం అన్నారు. దీనిని దేశ ప్రజలు గుర్తించాలన్నారు. మహాత్మా గాంధీ సాక్షిగా ఈ రోజు మౌన దీక్ష చేపడుతున్నామని, అందుకే ఈ దేశంలో నరేంద్రమోడీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యం బతికి ఉంటేనే ఈ దేశం ముందుకు నడవగలుగుతుందని చెప్పిన వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి అదానీ, అంబానీ లాంటి బడా వ్యాపార వేత్తలకు ఈ దేశాన్ని అమ్మేస్తున్నారని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను ధైర్యంగా చెప్పిన వ్యక్తి, నరేంద్ర మోడీ గురించి వాస్తవాలను తెలియజేసిన బిబిసి లాంటి ఛానల్ ను నిషేధించే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు.వరుసగా మోడీలే ఈ దేశంలో అవినీతిపరులు అవుతున్నారని అంటే మోడీ అని పేరున్న ఒక న్యాయవాది కేసు వేయడం వెనుక రాజకీయపరంగా కుట్ర జరిగిందన్నారు. ప్రజలు దీనిని గమనిస్తున్నారని, దేశ వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారని నరేంద్ర మోడీ నియంతృత్వ ధోరణిని, అప్రజాస్వామిక విధానాన్ని అంతం చేయాలని ప్రజలకు ఎంపి పొన్నం ప్రభాకర్ పిలుపు ఇచ్చారు.