సర్జికల్ స్ట్రైక్స్‌పై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా తాజాగా ఇదే అంశంపై ఆ పార్టీకి చెందిన మరో నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై వీడియో ఉంటే దాన్ని బయటపెట్టాలని కాంగ్రెస్ నేత రషీద్ అల్వి డిమాండ్ చేశారు.
సర్జికల్ స్ట్రైక్స్ గురించి అమిత్ షా ఓ రకంగా చెబుతుంటే యోగి ఆదిత్యానాధ్ మరో రకంగా చెబుతున్నారని అందుకే తాము ఆ వీడియోలను బయటపెట్టాలని కోరుతున్నామని చెప్పారు. అధికారంలో ఉన్నవారు పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనల్లో ఏ ప్రకటన విశ్వసించాలన్నదే ప్రశ్నని, బీజేపీకి కొనసాగింపే సైన్యం అనేలా కాషాయ పార్టీ వ్యవహరిస్తోందని అన్నారు. ఆర్మీ దేశానికి చెందినదని, బీజేపీది కాదని అల్వి పేర్కొన్నారు.