వరలక్ష్మి శరత్ కుమార్ .. విలక్షణమైన పాత్రలకు ఇప్పుడు ఈ పేరు కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తోంది. తమిళంలో ఆమె వరుస సినిమాలు చేస్తూ వెళుతోంది. తమిళంలో ఏ కథలో ఎలాంటి డిఫరెంట్ రోల్ ఉన్నా, అక్కడి మేకర్స్ ముందుగా ఆమె పేరునే పరిశీలిస్తున్నారు. ఇక లేడీ విలనిజం చూపించాలంటే అక్కడ ఆమె తప్ప మరో ఛాయిస్ లేదు. అలాంటి ఒక విలన్ రోల్ తోనే ఆమె ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ఆమె బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ .. వాయిస్ లోని ప్రత్యేకత ఇక్కడి ఆడియన్స్ కి కూడా నచ్చేశాయి.
దాంతో ఇక్కడి మేకర్స్ కూడా ఆమెకి ఆ తరహా పాత్రలను ఇవ్వడం మొదలుపెట్టారు. ‘క్రాక్’ .. ‘నాంది’ సినిమాలతో ఆమె ఇక్కడి ప్రేక్షకులకు మరింత చేరువైంది. సమంత ప్రధానమైన పాత్రను పోషించిన ‘యశోద’ లోను వరలక్ష్మి ఒక కీలకమైన పాత్రను పోషించింది. ‘మధుబాల’ అనే పాత్రలో ఆమె కనిపించనుంది. వరలక్ష్మి ఇంతవరకూ ఇక్కడ చేస్తూ వచ్చిన పాత్రల వలన, ‘యశోద‘లో ఆమె పాత్ర ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. ఆమె పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉండొచ్చుననే ఊహాగానాలు మొదలయ్యాయి.
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో వరలక్ష్మి బిజీగా ఉంది. కాకపోతే తన పాత్ర ఎలా ఉండబోతోందనే విషయాన్ని మాత్రం రివీల్ చేయడం లేదు. తన కెరియర్లోనే ఈ సినిమా ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందనే విషయాన్ని మాత్రం కాన్ఫిడెంట్ గా చెబుతోంది. ఆమె మాటలు ఈ సినిమాపై మరింత ఆయాసక్తిని పెంచుతున్నాయి. రేపు విడుదలవుతున్న ఈ సినిమాపైనే అందరి దృష్టి ఉంది. ఇక ఆమె నుంచి రానున్న ఆ తరువాత సినిమాల జాబితాలో ‘హను మాన్’ .. ‘వీర సింహారెడ్డి’ కనిపిస్తున్నాయి. ఈ సినిమాలతో ఇక్కడ వరలక్ష్మి మరింత పట్టుసాధించడం ఖాయంగానే కనిపిస్తోంది మరి.
Also Read : యశోదలో యాక్షన్ రియలిస్టిక్‌గా ఉంటుంది.