యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం కేసీఆర్ ఆయన సతీమణి శోభ ఈ రోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ దివ్య విమాన గోపురమునకు బంగారు తాపడం కోసం.. కేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని కేసీఆర్ మనుమడు హిమాన్షు అందించారు.
పూజల అనంతరం కేసీఆర్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కుటుంబ సమేతంగా దర్శనానికి వచ్చిన కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభతో కలిసి రోడ్డుమార్గంలో గుట్టకు చేరుకుని యాదాద్రీశునికి ప్రత్యేక పూజలు చేశారు. బాలాలయం ఆవరణలో ‘కళావేదిక’కు శంకుస్థాపన చేసిన సిఎం కెసిఆర్ అనంతరం అధికారులతో ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.
సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సుధీర్ రెడ్డి, జీవన్ రెడ్డి, వైటీడీఏ చైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈవో గీతా రెడ్డి ఉన్నారు.
కాగా, సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన దృష్ట్యా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. భద్రతా కారణాలతో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. సీఎం కేసీఆర్ రోడ్డుమార్గంలో యాదగిరిగుట్టకు వెళ్తుండటంతో ఎన్‌ఆర్‌జీఐ మెట్రోస్టేషన్, ఉప్పల్ ఎక్స్‌రోడ్, బోడుప్పల్, మెక్‌డొనాల్డ్స్, ఘట్‌కేసర్, బీబీనగర్, యాదాద్రి వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
అలాగే.. జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఏర్పాట్లనూ కేసీఆర్ వేగవంతం చేశారు. అందుకు సంబంధించిన పత్రాలపై దసరా పండుగనాడే ఆయన సంతకాలు చేయనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించేందుకు ఆ పత్రాలను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు.
జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన విషయాలను ఇన్నాళ్లూ గోప్యంగా ఉంచి, ముగ్గురు నలుగురు నాయకులకు మాత్రమే చెప్పిన కేసీఆర్.. దసరా దగ్గర పడుతుండడంతో ఇప్పుడు మరికొందరు కీలక నేతలకు కూడా ఈ విషయాన్ని చెప్పారని సమాచారం.