రంజాన్ మాసం మొదలైన ఏప్రిల్ 13 నుంచి ఇప్పటివరకూ తాలిబాన్ల దాడిలో 225 మంది మరణించారని ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 15 ఆత్మాహుతి దాడులతో పాటు పెద్ద సంఖ్యలో బాంబు దాడులకు తాలిబన్లు తెగబడ్డారని, 225 మంది చనిపోగా 500 మందికి పైగా గాయాల పాలయ్యారని వివరించింది.
ఆఫ్ఘన్ భద్రతా బలగాలు మరో 800 దాడులను ముందుగా పసిగట్టి నిలువరించారని, లేకపోతె వెయ్యి మంది వరకూ అసువులు బాసి ఉండేవారని ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని చెప్పారు. భద్రతా బలగాలకు అబినందనలు తెలిపారు.ఈద్ సందర్భంగా మూడురోజులపాటు దాడులకు విరామం ఇస్తున్నట్లు తాలిబన్లు
ఆదివారం ప్రకటించారు, ఆ తర్వాత అష్రాఫ్ కూడా కాల్పుల విరమణ పాటించాలని సైన్యానికి సూచించారు. ఇరువర్గాలు తీసుకున్న నిర్ణయాన్ని ఆఫ్ఘన్ లో అమెరికా ప్రత్యేక ప్రతినిధి జల్మే ఖలిల్జాద్ స్వాగతించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి భద్రతా బలగాలను ఉపసంహరించు కుంటున్నట్లు గత నెలలో అమెరికా ప్రకటించిన తరువాత తాలిబన్లు దాడులు తీవ్రతరం చేశారు.