జీఎస్టీ మండలి 45వ సమావేశం ప్రారంభమయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరుగుతున్న ఈ సమావేశానికి దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 20 నెలల తర్వాత తొలిసారి ప్రత్యక్షంగా ఈ సమావేశం జరుగుతుండటం విశేషం. గత రెండేండ్లుగా ఈ సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతున్నాయి.
ప్రస్తుత సమావేశంలో జీఎస్టీ మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. 11 రకాల కొవిడ్ ఔషదాలపై పన్ను రాయితీలను పొడిగించనున్నారు. అదేవిధంగా పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతోపాటు మరో 48 రకాల వస్తువులపై పన్ను రేట్లను ఈ భేటీలో సమీక్షించనున్నారు.