ఆఫ్ఘనిస్తాన్ పై తాలిబన్లు పట్టుబిగిస్తున్నారు. ఇరాన్ సరిహద్దు ప్రాంతాలతో పాటు మొత్తం 85 శాతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. ఈ నేపధ్యంలో కాందహార్ లోని భారత కాన్సులేట్ లో పనిచేస్తున్న దాదాపు 50 మంది అధికారులను ఖాళీ చేయించి స్వదేశానికి రప్పించారు. వీరిలో అధికారులతో పాటు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు సిబ్బంది కూడా ఉన్నారు. 20 సంవత్సరాల తర్వాత అమెరికా తన బలగాలను ఆఫ్ఘాన్ నుంచి ఉపసంహరించుకుంది. దీనితో దేశంపై తమ పెత్తనాన్ని కొనసాగించేందుకు తాలిబన్లు సిద్ధమయ్యారు. పలు ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. పాలనపై తమ పట్టు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కాందహార్ లో ఇండియన్ కాన్సులేట్ మూసివేస్తున్నట్లు వచ్చిన వార్తలను దౌత్య వర్గాలు ఖండించాయి, తమ రాయబార కార్యాలయ కార్యకలాపాలు కొనసాగుతాయని వెల్లడించాయి. కాందహార్ లో శాంతి భద్రతలు రోజు రోజుకీ క్షీణిస్తున్న దృష్ట్యా కొంతమంది సిబ్బందిని వెనక్కు పిలిపిస్తున్నామని, కాన్సులేట్ యధావిధిగా పని చేస్తుందని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా, ఆఫ్ఘన్ లో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ ఇటీవలే వెల్లడించింది. మరోవైపు ఆఫ్హన్ అధికారులు భారత దౌత్య బృందంతో సమావేశమై తమ దేశంలోని వాస్తవ పరిస్థితిని తెలియజేశారు.