Sunday, January 19, 2025
Homeసినిమాకూల్ ఎంటర్‌టైనర్‌గా ఎంఎస్ రాజు ‘7 డేస్ 6 నైట్స్’

కూల్ ఎంటర్‌టైనర్‌గా ఎంఎస్ రాజు ‘7 డేస్ 6 నైట్స్’

దర్శకునిగా ‘డర్టీ హరి’తో ఎంఎస్ రాజు బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. నిర్మాతగానూ ఆయన సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్స్ ప్రేక్షకులకు అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకం పై ఎంఎస్ రాజు రూపొందిస్తున్న ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్, రజనీకాంత్ నిర్మాతలు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. ఈ రోజు సినిమా పోస్టర్ విడుదల చేశారు.

‘7 డేస్ 6 నైట్స్’ పోస్టర్ చూస్తుంటే సుమంత్ అశ్విన్ హీరో అని అర్థమవుతుంది. ఆయన పక్కన క్యూట్‌గా ఉన్న హీరోయిన్ మెహర్ చావల్ (తొలి పరిచయం). మరో జంటగా రోహన్, క్రితికా శెట్టిని పరిచయం చేస్తున్నారు ఎంఎస్ రాజు. మరో ఇద్దరు అందమైన అమ్మాయిలు సుష్మ, రిషికా బాలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ గోపరాజు రమణ అతిథి పాత్రలో కనిపించనున్నారు.

హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ… “జూన్ 21న హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ స్టార్ట్ చేశాం. నాన్‌స్టాప్‌గా 22 రోజులు చిత్రీకరణ చేశాం. ఈ నెలాఖరున అవుట్‌డోర్ షెడ్యూల్ కోసం ప్రయాణమవుతాం. జూలై 28 నుంచి 20 రోజుల పాటు కంటిన్యూస్‌గా బెంగళూరు, ఉడిపి, గోకర్ణ, గోవాలలో షూటింగ్ చేస్తాం” అని అన్నారు.

దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ …“సాధారణంగా ‘డర్టీ హరి’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మళ్లీ అదే తరహా సినిమా చేస్తారని అందరూ ఊహిస్తారు. కానీ, ‘7 డేస్ 6 నైట్స్’ అందుకు భిన్నంగా వేరే రీతిలో ఉండే చిత్రమిది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంటిల్లిపాదినీ వినోదపరిచే విధంగా చక్కటి జాలీ ట్రిప్‌లా ఉంటుంది. మంచి కథ, దానికి తగ్గ ఆర్టిస్టులను ఎంపిక చేసుకుని దర్శకునిగా సినిమా చేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పటికి 60 శాతం సినిమా పూర్తయింది” అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్