కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కన్నుమూశారు. 79 ఏండ్ల ఊమెన్ చాందీ గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. దీంతో బెంగళూరులోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో మంగళవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుమారుడు చాందీ ఊమెన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
1943, అక్టోబర్ 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్‌లో ఊమెన్ చాందీ జన్మించారు. 1970లో తన 27 ఏండ్ల వయస్సులో పూతుపల్లి నుంచి తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. మొత్తం 12 సార్లు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1977లో కే.కరుణాకరన్ మంత్రివర్గంలో మినిస్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
2004 నుంచి 2006 వరకు, 2011-2016 వరకు రెండుసార్లు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఆయన ఒకే పార్టీలో కొనసాగడం విశేషం. మాజీ ముఖ్యమంత్రి మృతిపట్ల కేరళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కే. సుధాకరణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయిందని చెప్పారు.