Saturday, November 23, 2024
HomeTrending NewsTelangana:సకల జనులతోనే తెలంగాణ - కిషన్ రెడ్డి

Telangana:సకల జనులతోనే తెలంగాణ – కిషన్ రెడ్డి

తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బానిసగా మారిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను కిషన్​ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను సత్కరించి, వారికి పాదాభివందనం చేశారు. మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు అమరవీరుల కుటుంబాల దగ్గరికి వెళ్లి వారితో మాట్లాడి కావాల్సిన సాయం అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో అవినీతి పెరిపోయిందన్నారు కేంద్ర మంత్రి. రాష్ట్రం దగా పడ్డ తెలంగాణగా మారిపోయిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

– సకల జనులు పోరాడుతానే తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది.

– 1200 మంది రాష్ట్రం కోసం అమరులయ్యారు.

– పార్లమెంట్​లో ప్రతిపక్ష నేతగా సుష్మా స్వరాజ్​ తెలంగాణ ఏర్పాటు కోసం చేసిన కృషిని గుర్తుకు తెచ్చుకోవాలి.

– ఏ ఒక్క కుటుంబం, ఏ ఒక్క పార్టీతోనే తెలంగాణ రాలేదు.. యావత్తు తెలంగాణ ప్రజలు సంఘటితంగా పోరాటం చేస్తే వచ్చింది.

– పార్లమెంట్​లో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ.. నాటి ప్రభుత్వ మెడలు వంచి బిల్లు పెట్టించింది.

– తెలంగాణ జేఏసీలో బీజేపీ క్రియాశీలక పాత్ర పోషించింది.

– చిన్న రాష్ట్రాలు ఏర్పడితేనే వేగంగా అభివృద్ధి జరుగుతుందనేది బీజేపీ ఆలోచన. అందుకే మాజీ ప్రధాని వాజ్‌పేయి ​ గారు గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేశారు.

– తెలంగాణ ఏర్పాటు సమయంలో కూడా బీజేపీ అన్ని రకాలుగా సహకరించింది.

– తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బానిసగా తయారైంది. రాష్ట్రంలో అవినీతి పెరిగి పోయింది.

– ఏ ఆకాంక్షల కోసమైతే.. తొలిదశ పోరాటంలో 369 మంది, మలిదశ పోరాటంలో 1200 మంది బలిదానం చేసుకున్నారో, ఏ ఆకాంక్షలతో సకల జనుల సమ్మెలో రాష్ట్రమంతా పాల్గొన్నదో… ఆ ఆకాంక్షలకు అనుగుణంగా నేడు పాలన సాగుతున్నదా.. తెలంగాణ ప్రజలు ఒక్కసారి గమనించాలి.

– రాష్ట్రం దగా పడిన తెలంగాణగా మారిపోతున్నది. అవినీతి రాష్ట్రంగా మారింది. కుటుంబ పాలనతో అనేక రకాలుగా మోసం జరుగుతున్నది.

– భూముల అవినీతి, ల్యాండ్​ మాఫియా, ధరణి మాఫియా, లిక్కర్​ మాఫియా, ఇసుక మాఫియా, ఉద్యోగాల పేరుతో మాఫియా, టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ మాఫియా, దళితబంధు దోపిడీ మాఫియా, కాంట్రాక్టర్ల మాఫియా, గొర్రెల పంపిణీలో మాఫియా, డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లలో మాఫియా, బొగ్గు గనుల కేటాయింపులో మాఫియా, పెద్ద నగరాలలలో ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్లలో కూడా మాఫియా, చెరువుల భూముల ఆక్రమణలో మాఫియా..

– అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం లేదు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది.

– ప్రపంచంలో అప్పు ఇవ్వగలిగే అన్ని సంస్థల వద్ద అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. ఈ అప్పుల కోసమా మనం తెలంగాణ తెచ్చుకున్నది?

– అప్పులు చేసి అభివృద్ధి, సంక్షేమానికి పెట్టాల్సింది పోయి… వేల కోట్ల అవినీతి చేస్తున్నరు.

–కేజీ టు పీజీ విద్య ఏమైంది? గిరిజనులకు రిజర్వేషన్లు ఏమైనయి? అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోదు.. తెలంగాణలో మతపరమైన రిజర్వేషన్లు తీసేస్తే.. గిరిజనులకు రిజర్వేషన్లు వస్తాయి.

– రుణాలు మాఫీగాక, గత్యంతరం లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నరు.. చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచ్​లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి వారికి వెన్నుపోటు పొడిచింది ఈ ప్రభుత్వం.

– నేతల ఫామ్‌హౌజ్‌లు పెరుగుతున్నయి కానీ.. పేదోడికి డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు లేవు.

– ఉద్యమ ద్రోహులకు అధికారంలో, పదవుల్లో పెద్దపీట వేస్తున్నరు.

– తెలంగాణ బంగారం కాలేదు కానీ.. అధికారంలో ఉన్న నేతల కుటుంబాలు మాత్రం బంగారం అయ్యాయి.

– దళితులకు 2014లో వెన్నుపోటు పొడిచారు. మూడెకరాల భూమి, దళిత సీఎం హామీలు ఏమైనయి? ఎమ్మెల్యేలు దళితబంధులో కమీషన్లు దండుకుంటున్నారు.

– ప్రశ్నించే గొంతుకలైన జర్నలిస్టులు, ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలపై ఎందుకు అక్రమ కేసులు పెడుతున్నారో చెప్పాలి.

– ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి, అరాచక శక్తులను పెంచి పోషించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.

– ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. ఆరోగ్యశ్రీ అటకెక్కింది. బీసీ, ఎస్సీ, మైనార్టీ కార్పొరేషన్లు ఎటుపోయాయి?

– తెలంగాణ వచ్చాక ఏమున్నది గర్వకారణం.. అన్ని రంగాల్లో అవినీతి, అహంకారం, నియంతృత్వం, దుర్మార్గం, కుటుంబపాలన

– తెలంగాణ నగరాలను ఇస్తాంబుల్​ చేస్తాం, సింగపూర్​, డాలస్​ చేస్తామని చెప్పారు.. కానీ కనీస సౌకర్యాలు లేక నగర ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.

– నిమ్స్​ లాంటి హాస్పిటల్స్​ కడతామన్నారు.. ఏమైంది? ఉస్మానియాకు తాళం వేశారు.. ఉస్మానియాలోకి మూసీ వరద నీళ్లు వస్తున్నాయి.

– హాస్టల్​ విద్యార్థులకు పురుగుల అన్నం, నీళ్ల చారు, ఫుడ్​ పాయిన్​ కేసులతో హాస్పిటళ్ల పాలవుతున్నారు.

– సెక్రటేరియట్​లోకి, ప్రగతిభవన్​లోకి ప్రజలు వెళ్లడానికి అవకాశం లేదు. ప్రజలకు అనుమతి లేని ఈ నిర్మాణాలు ఎందుకోసం?

– ధాన్యం కొనుగోళ్లలో రైతులు అనేక ఇబ్బంది పడుతున్నారు. కౌలు రైతులకు ఎలాంటి సాయం లేదు. అమరవీరుల కుటుంబాలు గోస పడుతున్నాయి.

– ఆదాయానికి మించి అంచనాలు, ఇబ్బడిముబ్బడిగా అప్పులు.. అయినా ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి.

– రాష్ట్ర ఆదాయం చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు సరిపోతుంది. మరి తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతుంది?

– కార్పొరేషన్ల పేరుతో పెద్ద ఎత్తున అప్పులు చేసింది.

– కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతున్నారు.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్రం పీయూసీలు, సెంట్రల్​ కార్పొరేషన్ల ద్వారా లక్షల కోట్ల రూపాయల రుణం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది.

– ఒక ఎకరం వరి సాగు చేసే రైతుకు ఏడాదికి 18000 సబ్సిడీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని కిసాన్​ సమ్మాన్​ 6000 సాయం దీనికి అదనం.

– ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రతి పేదవాడికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం, బస్తీ దవాఖానలను కేంద్రం ఇచ్చింది.

– తెలంగాణలోనే లక్షా 20 వేల కోట్ల జాతీయ రహదారి పనులు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం.. ట్రిఫుల్​ ఆర్​ రోడ్డుకు కేంద్రం 25 వేల కోట్లు ఖర్చు పెడుతున్నది. హైదరాబాద్​ టు వరంగల్​ వరకు జాతీయ రహదారి సిమెంట్​ రోడ్డు వేసింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరించింది.

– కొత్త రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించింది. కేంద్రం తెలంగాణకు ఏం ఇచ్చిందో మరో వేదికపై తెలంగాణ ప్రజలకు వివరిస్తం.

– నరేంద్ర మోదీ ఆశీస్సులతో తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం.. హైదరాబాద్​ నుంచి విశాఖపట్నంకు కొత్త రైల్వే ప్రాజెక్టు కోసం కేంద్రం సర్వీఏ ప్రారంభించింది. 20 వందే భారత్​ ట్రైన్లలో తెలంగాణకు కేంద్రం రెండు ఇచ్చింది. 700 కోట్ల సికింద్రాబాద్​ స్టేషన్​ పనులకు ప్రధాని స్వయంగా శంకుస్థాపన చేశారు. తెలంగాణలో 30 రైల్వే స్టేషన్లను కేంద్రం ఆధునీకరిస్తున్నది.

– తెలంగాణ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. దేశవ్యాప్తంగా సుమారు నాలుగు కోట్ల ఇండ్లు కట్టింది కేంద్రం.. కానీ ఈ రాష్ట్రంలో పేదలకు ఇండ్లు లేవు. ప్రతి పేదవాడికి 5 లక్షల కార్పొరేట్​ వైద్యం మోదీ ప్రభుత్వం ఇస్తున్నది. వరదలతో రైతులు నష్టపోతున్నరు. కేంద్రం ఫసల్​ బీమా యోజన తెస్తే.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదు.

– కేంద్ర ప్రభుత్వం, మోదీ కారణంగానే దేశానికి, ఆయా రాష్ట్రాలకు పెట్టుబడులు వస్తున్నాయి.

– తెలంగాణ ఏర్పాటుకు ముందే హైదరాబాద్​లో ఎంతో అభివృద్ధి జరిగింది.

– కుటుంబ పార్టీల జోక్యం లేని, నియంతృత్వం లేని, ప్రజాపాలన తెలంగాణలో రావాలి, వస్తుందని నేను ఆశిస్తున్నా. అని కేంద్రమంత్రి అన్నారు.

ఈ సందర్బంగా తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

– అనంతరం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC) హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ‘కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లలో సాధించిన విజయాలు’ అనే అంశంపై గోల్కొండ కోటలో రెండు రోజుల ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించి సందర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్