నాగశౌర్యకి కొంతకాలంగా సరైన హిట్ పడలేదు. అలాంటి ఒక హిట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చిన ఆయన, ‘రంగబలి’ సినిమా చేశాడు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో యుక్తి తరేజా అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా పరిచయమైంది. జులై 7వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. ఆ సినిమా ఈ రోజు నుంచి ‘నెట్ ఫ్లిక్స్’ లో అందుబాటులోకి వచ్చింది. థియేటర్స్ లో ఈ సినిమాను చూడలేకపోయిన వారు, ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై చూడొచ్చు.
‘రంగబలి’ కథ విషయానికొస్తే హీరో .. హీరోయిన్ ను ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. తాను మిడిల్ క్లాస్ కుర్రాడే అయినా .. ఆ అమ్మాయి శ్రీమంతుల ఫ్యామిలీ నుంచి వచ్చిందని తెలిసినా భయపడడు. నేరుగా ఆమె తండ్రి దగ్గరికి వెళ్లి, ఆయన కూతురుతో సాగుతున్న తన లవ్ మేటర్ చెబుతాడు. తమకి పెళ్లి జరిపించమని అడుగుతాడు. అతనిది ఏ ఊరు అనేది తెలుసుకున్న ఆమె తండ్రి, ఆ ఊరు వదిలి వస్తేనే తప్ప తన కూతురును ఇవ్వనని తేల్చి చెబుతాడు.
అప్పుడు హీరో తన ఊరు గురించి .. తన ఊళ్లోని ‘రంగబలి’ సెంటర్ గురించి తెలుసుకోవడం మొదలుపెడతాడు. అతను తెలుసుకునే ఆ నిజాలు ఏమిటనే అంశాలతో ఈ కథ ఆసక్తికరంగా నడుస్తుంది. నాగశౌర్య యాక్షన్ .. సత్య కామెడీ .. యుక్తి గ్లామర్ .. షైన్ టామ్ చాకో విలనిజం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ సరదాగా చూడవలసిన సినిమా. నిజానికి ఇది నాగశౌర్య కి హిట్ తెచ్చిపెట్టవలసిన సినిమా. ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ ను రాబట్టే అవకాశాలు ఉన్నాయి.