తూర్పు అమెరికాను తుఫాను వణికిస్తున్నది. భీకర గాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టిస్తున్నది. ప్రమాద ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వందల విమానాలు రద్దయ్యాయి. వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 11 లక్షలకుపైగా ఇండ్లు, వాణిజ్య కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. న్యూయార్క్ నుంచి టెన్నెసీ వరకు 10 రాష్ర్టాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. 2.95 కోట్ల మంది టోర్నడోల ముప్పు ఎదుర్కొంటున్నారని వాతావరణ విభాగం తెలిపింది.
‘అత్యంత బలమైన గాలులతో తుఫాన్లు, టోర్నడోలు విరుచుకుపడే ప్రమాదముంది. ప్రజలు ఇంటి వద్దే ఉండాలి. బయటకు రావొద్దు’ అని హెచ్చరికలు జారీచేసింది. అలబామా, జార్జియా, దక్షిణ కరోలినా, ఉత్తరకరోలినా, మేరీల్యాండ్, డెలావర్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, టెన్నెసీ, వెస్ట్ వర్జీనియా, వర్జీనియాలో 11 లక్షల ఇండ్లకు విద్యుత్తు నిలిచిపోయినట్టు అధికారులు తెలిపారు.