రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. సర్కారు దవాఖానల్లో మౌలిక వసతులు పెంచడంతో పాటు, నిపుణులైన వైద్య సిబ్బందిని కూడా నియమిస్తోంది. ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తున్నది. ఈ ఏడాది జూలై నెలలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో 72 శాతం గవర్నమెంట్ హాస్పిటళ్లలోనే నమోదయ్యాయి. ఈ సందర్భంగా వైద్యారోగ్య సిబ్బందిని మంత్రి హరీశ్ రావు అభినందించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ దవాఖానల్లో 30 శాతంగా ఉన్న ప్రసవాల సంఖ్య, ఇప్పుడు 72శాతానికి పెరిగిందన్నారు. సర్కారు దవాఖానలపై ప్రజలకు పెరిగిన నమ్మకానికి ఇది నిదర్శనమని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంతోనే ఇది సాధ్యమైందని వెల్లడించారు.
2014లో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 30 శాతమే ఉండేవి. అంటే ప్రతి వంద మంది గర్భిణుల్లో 30 మంది ప్రభుత్వ దవాఖానకు వస్తే.. 70 మంది ప్రైవేట్‌కు వెళ్లేవారు. అయితే సీఎం కేసీఆర్ సంకల్పంతో కేవలం తొమ్మిదేండ్లలోనే సీన్ మొత్తం రివర్స్ అయ్యిందని చెప్పారు. ఏప్రిల్ నెలలో 69 శాతంగా ఉన్న ప్రసవాల రేటు ఇప్పుడు 72 శాతానికి పెరగడం విశేషం.