భారతీయ సంప్రదాయాన్ని మంటగలిపే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. లోకసభలో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన బండి సంజయ్ కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ పార్టీలపై విమర్శలు సంధించారు. భారత మాతను తులనాడే విధంగా మాట్లాడే వారు ఎవరైనా సహించేది లేదని హెచ్చరించారు. భారత మాతను ఎవరు చంపలేరన్నారు. తెలంగాణ సాధన కోసం ఎంతో మంది బలిదానం చేస్తే పట్టించుకోని కాంగ్రెస్ ఈ రోజు నీతులు వల్లెస్తోందని మండిపడ్డారు.
చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు కెసిఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటోందని బండి సంజయ్ విమర్శించారు. కెసిఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతోందని…కెసిఆర్ కుమారుడి ఆస్తులు నాలుగు వందల రెట్లు పెరిగాయాని ఆరోపించారు. అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు వస్తుంటే అవి తమవి చెప్పుకోవటం కెసిఆర్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు ఇవ్వని కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ నంబర్ వన్ అని ప్రచారం చేస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్, ఎంఐఎం, బీ.ఆర్.ఎస్ ల మధ్య పొత్తు ఉందని బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. దేశ సేవ చేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ బీ ఆర్ ఎస్ మధ్య ఒప్పందం ఉందన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీ ఆర్ ఎస్ లో చేరారని బండి సంజయ్ గుర్తు చేశారు. తెలంగాణలో విమర్శించుకుంటారు ఢిల్లీలో కలుసుకుంటారని ఆరోపించారు. రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు.