అక్టోబర్ 5 నుంచి ఇండియా వేదికగా జరగనున్న ఐసిసి పురుషుల వన్డే వరల్డ్ కప్-2023కు ఇంగ్లాండ్ 15 సభ్యుల జట్టును ప్రకటించింది. వన్డే జట్టుకు గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన బెన్ స్టోక్స్ కు చోటు దక్కడం గమనార్హం. రెండ్రోజుల క్రితమే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు స్టోక్స్ ప్రకటించిన వెంటనే వన్డే జట్టులో బెర్త్ దక్కింది. అయితే ఈ 15 సభ్యుల టీమ్ లో హ్యారీ బ్రూక్, జోఫ్రా ఆర్చర్ లకు మొండిచేయి దక్కింది.
ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 15 వరకూ న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్ లో పర్యటించి ఐదు టి20లు, నాలుగు వన్డే మ్యాచ్ లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన వన్డే జట్టు యథాతథంగా వరల్డ్ కప్ కూడా ఆడుతుందని ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సెలెక్టర్ ల్యూక్ రైట్ ధ్రువీకరించాడు.
కొంతమంది కీలక ఆటగాళ్లను పక్కన పెట్టడం ఇబ్బందే అయినా తప్పడం లేదని, జట్టు విజయాన్ని శాసించగల బెన్ స్టోక్స్ కు ఈ మెగా టోర్నీలో అవకాశం కల్పించామని, జోఫ్రా ఆర్చర్ కు చోటు లేకపోయినా జట్టుతోనే ఉంటాడని, రిజర్వు ప్లేయర్ గా కొనసాగుతాడని వివరించాడు.