బిహార్‌లో దారుణం జరిగింది. అరారియా జిల్లాలో ఈ రోజు (శుక్రవారం) ఉదయం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు జర్నలిస్టును కాల్చిచంపారు. మృతుడిని దైనిక్ జాగరణ్‌లో పనిచేసే బిమల్ యాదవ్‌గా గుర్తించారు. రాణీగంజ్‌లోని ఆయన నివాసానికి వచ్చిన నలుగురు దుండగులు నేరుగా యాదవ్ ఛాతీపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో యాదవ్ అక్కడికక్కడే మరణించారు.
పోస్ట్‌మార్టం కోసం బాధితుడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించగా స్ధానికుల ఆందోళనతో ఆ ప్రాంతం అట్టుడికింది. ఘటనా ప్రాంతానికి ఎస్పీ, స్ధానిక ఎంపీ చేరుకున్నారు. అరారియా జిల్లాలోని రాణిగంజ్ మార్కెట్ ప్రాంతంలో దైనిక్ జాగరణ్‌లో పనిచేసే జర్నలిస్ట్ విమల్ యాదవ్‌పై ఆయన నివాసంలో దుండగులు కాల్పులు జరపడంతో యాదవ్ మరణించారని ఎస్పీ అశోక్ కుమార్ సింగ్ తెలిపారు.
బిహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో ఘోరంగా విఫలమవుతోందని, ఇందుకు జర్నలిస్ట్ హత్యే నిదర్శనమని లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్ పాశ్వాన్) నేత చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు.