టోక్యో ఒలింపిక్స్ మహిళల హాకీలో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్ లో ఇండియా జట్టు ఓటమి పాలైంది. నేడు జరిగిన మ్యాచ్ లో 4-3 తేడాతో బ్రిటన్ జట్టు విజయం సాధించి కాంస్య పతకం సాధించింది. ఆట మొదటి భాగంలో ఎవరూ గోల్ చేయలేదు. రెండవ పావు భాగంలో బ్రిటన్ కొద్ది నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ సాధించింది. ఆ వెంటనే గుర్మీత్ కౌర్ పెనాల్టీ కార్నర్ ను గోల్ మలిచి ఇండియాకు మొదటి గోల్ అందించింది. గుర్మీత్ ఇండియాకు రెండో గోల్ సాధించి స్కోర్ సమం చేసింది. రెండో పావు భాగం చివరి నిమిషంలో ఇండియా మరో గోల్ చేసి ఆధిక్యం సంపాదించింది.
మూడో పావు భాగం మొదట్లోనే ఇంగ్లాండ్ గోల్ సాధించి మళ్ళీ స్కోరు సమం చేసింది. నాలుగో పావు భాగంలో బ్రిటన్ క్రీడాకారిణి గ్రేస్ బాల్స్ డన్ గోల్ సాధించి బ్రిటన్ కు 4-3 తో ఆధిక్యం సంపాదించి పెట్టింది. ఆ తరువాత గోల్స్ సాధించడం కంటే ప్రత్యర్ధిని నిలువరించడంపైనే బ్రిటన్ జట్టు దృష్టి పెట్టి, ఇండియాకు మరో గోల్ చేసే అవకాశాన్ని ఏమాత్రం ఇవ్వలేదు. దీనితో ఇండియాకు కాంస్యపతకం చేజారింది.